Mamata Banerjee: రాష్ట్రపతి విందుకు మమత హాజరుపై కాంగ్రెస్ విమర్శ

Sky would not fall if Mamata Banerjee did not attend G20 dinner Says Adhir Ranjan
  • ఆమె వెళ్లకపోయుంటే ఆకాశం ఊడిపడేదా? అన్న అధిర్ రంజన్
  • విపక్ష కూటమి సీఎంలు మానుకున్నారని గుర్తుచేసిన కాంగ్రెస్ నేత
  • వేరే ప్రయోజనాలేమైనా ఆశించారా? అని సందేహం
జీ20 సదస్సు సందర్భంగా అతిథులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి విందు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విందుకు విదేశీ అతిథులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాష్ట్రపతి ఆహ్వానించారు. అయితే, విపక్ష కూటమికి చెందిన పలువురు ముఖ్యమంత్రులు ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారు. విందుకు దూరంగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం రాష్ట్రపతి ఇచ్చిన విందుకు హాజరయ్యారు. పైగా ఒకరోజు ముందుగానే అంటే శుక్రవారమే మమత ఢిల్లీకి చేరుకున్నారు. ఈ విషయంపై విపక్ష కూటమిలో కీలక పార్టీ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

చాలామంది ముఖ్యమంత్రులు ఈ విందుకు దూరంగా ఉండగా.. మమత మాత్రం ఒకరోజు ముందే వెళ్లడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మమతా బెనర్జీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రపతి విందుకు ఆమె హాజరు కాకుంటే ఆకాశం ఊడిపడేదా? అంటూ ప్రశ్నించారు. విందు కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పక్కన మమత కూర్చోవడంపై అధిర్ రంజన్ సందేహాలు వ్యక్తం చేశారు. శనివారం హాజరవ్వాల్సిన కార్యక్రమానికి శుక్రవారమే వెళ్లడం చూస్తుంటే మమత ఢిల్లీ ప్రయాణం వెనక ఇతరత్రా ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయేమోనని అన్నారు.

కాంగ్రెస్ విమర్శలను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, రాజ్యసభ ఎంపీ శంతనుసేన్ తిప్పికొట్టారు. తమ పార్టీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరని స్పష్టం చేశారు. బెంగాల్ ముఖ్యమంత్రి ఎప్పుడు ఎక్కడికి ప్రయాణించాలన్నది కాంగ్రెస్ నేతలు నిర్ణయించలేరని చెప్పారు. రాష్ట్రపతి విందుకు హాజరవడం, విందులో కూర్చోవడం.. తదితర అంశాలన్నీ ప్రొటోకాల్ ప్రకారమే జరిగాయని వివరించారు. ఇక విపక్ష కూటమిలో మమతా బెనర్జీ పాత్ర ఏమిటనేది కానీ, కూటమి విషయంలో ఆమె నిబద్ధత గురించి కానీ స్పీచ్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఎంపీ శంతనుసేన్ స్పష్టం చేశారు.
Mamata Banerjee
G20 dinner
Adhir Ranjan
Congress
MP Shantanu sen
TMC

More Telugu News