Balakrishna: నేను వస్తున్నా.. తెలుగు వారి సత్తా చూపిద్దాం: బాలకృష్ణ
- ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు అంతా ఏకమవ్వాలని పిలుపు
- చంద్రబాబు అరెస్టుతో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు సంతాపం
- వారి కుటుంబాలను పరామర్శించేందుకు త్వరలో యాత్ర చేస్తానని వివరణ
- గార్ధబంబున కేల అంటూ నారసింహ శతకంలోని పద్యం చదివిన బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు అంతా ఒక్కటవ్వాలని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం తాను వస్తున్నానని, ముందుండి నడుస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎవరూ ఎవరికీ భయపడాల్సిన పనిలేదని టీడీపీ శ్రేణులకు, ప్రజలకు ధైర్యం చెప్పారు. అందరమూ కలిసి తెలుగు వాడి సత్తాను, పౌరుషాన్ని చూపిద్దామని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై స్పందించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారని, చట్టాన్ని అతిక్రమించి మరీ జైలుకు పంపించారని మండిపడ్డారు.
చంద్రబాబు అరెస్టు వార్త తెలిసి గుండెపోటుతో చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆ కుటుంబాలను ఓదార్చేందుకు తాను త్వరలో యాత్ర చేపడతానని వివరించారు. అదేవిధంగా చంద్రబాబు అరెస్టును ఖండించిన ప్రతీ ఒక్కరికీ, రాష్ట్ర నేతలతో పాటు జాతీయ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా నారసింహ శతకంలోని ఓ పద్యాన్ని బాలకృష్ణ వినిపించారు. గార్దభంబున కేల కస్తూరి తిలకంబు.. అని మొదలుపెట్టి మన రాష్ట్రమునకేల ఈ సీఎం జగను.. అంటూ ముగించారు.
గార్ధభంబున కేల- కస్తూరి తిలకంబు
మర్కటంబున కేల-మలయజంబు
శార్దూలముల కేల-శర్కరాపూపంబు
సూకరంబున కేల-చూతఫలము
మార్జాలమున కేల- మల్లెపువ్వుల బంతి
గుడ్లగూబకు నేల-కుండలములు
మహిషంబున కేల- నిర్మల వస్త్రముల్
బక సంతతికి నేల-పంజరంబు
మన రాష్ట్రమునకేలా ఈ సీఎం జగను!