healthy: ఇలా జీవిస్తే.. ఆహారం, వ్యాయామంతో సంబంధం లేదు..!
- బ్లూజోన్ ప్రాంతాల్లోని వారిలో ఆయుర్దాయం ఎక్కువ
- వారి జీవన విధానంలో కొన్ని ఆసక్తికరమైన అలవాట్లు
- ఒత్తిడి లేకుండా హాయిగా జీవించడమే ఆరోగ్యం
ఆరోగ్యంగా, ఎక్కువ కాలం పాటు జీవించాలి.. ఇలా ఎక్కువ మంది కోరుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఆరోగ్యంగా జీవించడానికి చేస్తున్న పనిని మానేసి, బ్లూజోన్ కు వెళ్లి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. జీవితాన్ని మార్చేసే సులభ విధానాలు కొన్ని ఉన్నాయి. కాస్త క్రమశిక్షణతో వీటిని రోజువారీ జీవనంలో భాగం చేసుకుంటే చాలు. కొంచెం కష్టమే అయినా సంక్పలం ఉంటే వీటిని సాధించడం కష్టమేమీ కాబోదు.
ఆరోగ్యం కోసం సాధారణంగా సరైన, సమతులాహారం తీసుకోవాలని, రోజువారీ వ్యాయామాలను జీవితంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. మంచి ఆరోగ్యానికి ఇవి రెండూ ముఖ్యమే. కానీ, ఇవి కాకుండా ఇతర అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించే వారు బ్లూ జోన్ ఏరియాలో ఉండటం గమనించొచ్చు. వారి జీవన విధానం, అలవాట్లు గమనించినప్పుడు పరిశోధకులకు ఎన్నో ఆసక్తికర విషయాలు తెలిశాయి.
ఒత్తిడి వద్దు..
దీర్ఘకాలం పాటు ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు మన శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ పెరిగిపోతుంది. సంతోషంగా ఉండాలని భావించే వారు ముందుగా ఈ ఒత్తిడిని జయించాలి. బ్లూజోన్ ప్రాంత వాసుల్లోనూ ఈ ఒత్తిడి కనిపించదు.
సామాజిక జీవవనం
సామాజికంగా చురుగ్గా ఉండడం కూడా అవసరం. మద్దతుగా నిలిచే వ్యక్తులు, మంచి అనుబంధాలు అనేవి కూడా అవసరమే. కుటుంబ సభ్యులు అయినా స్నేహితులతో అయినా మంచి సంబంధాలు కలిగి ఉండడం ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇష్టమైన, ప్రియమైన వారితో సమయం గడపడం వల్ల ఒత్తిడి తొలగిపోతుంది. ప్రియమైన వారి మద్దతు సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
ఆల్కహాల్
ఆల్కహాల్ వల్ల వచ్చే ప్రయోజనం లేదు.. అధికంగా సేవిస్తే ఆరోగ్యం దెబ్బతింటుందనే హెచ్చరిక వినే ఉంటారు. నిజమే ఆల్కహాల్ ను రోజూ అలవాటు మేరకు తీసుకోవడం నష్టమే చేస్తుంది. బ్లూజోన్ వాసులు ప్రతి రాత్రి భోజనానికి ముందు గ్లాస్ వైన్ తీసుకోవడం అలవాటు. అంటే ఆల్కహాల్ తీసుకోవాలని ఇక్కడ చెప్పడం లేదు. తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి, నలుగురితో కలవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
సంతోషం కోసం
నేటి దైనందిన జీవితంలో ఖాళీ సమయం అనేదే వీలు చిక్కడం లేదు. కానీ, ఒకవైపు ఎంత పని భారం ఉన్నప్పటికీ, జీవితానికి సంతోషాన్నిచ్చేవి ఆచరించాలి. మీకు సంతోషాన్ని కలిగించే వాటి కోసం ఖర్చు చేసినా అది పెట్టుబడి అవుతుంది.