Janasena: లోకేశ్ ను కలిసి పూర్తి మద్దతును ప్రకటించిన జనసేన నేతలు
- రాజమండ్రిలో లోకేశ్ ను కలిసిన జనసేన నేతలు
- చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శ
- జగన్ దుర్మార్గ పాలనపై కలిసి పోరాడుదామని వ్యాఖ్య
రాజమండ్రిలో ఉన్న టీడీపీ యువనేత నారా లోకేశ్ ను జనసేన నేతలు కలిశారు. చంద్రబాబు అరెస్ట్ ను జనసేన తీవ్రంగా ఖండిస్తోందని ఈ సందర్భంగా వారు చెప్పారు. తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతును ప్రకటిస్తున్నామని తెలిపారు. మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని, జగన్ దుర్మార్గ పాలనపై కలిసి పోరాడుదామని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశారని విమర్శించారు. అరెస్ట్ ను ఖండించిన వారిపై కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల తర్వాత వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమని అన్నారు.
మరోవైపు టీడీపీ బంద్ కు మద్దతు తెలిపి, బంద్ లో పాల్గొన్నందుకు జనసేన నేతలకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. లోకేశ్ ను కలిసిన జనసేన నేతల్లో కందుల దుర్గేశ్, ప్రియా సౌజన్య, వేగుళ్ల లీలాకృష్ణ, పితాని బాలకృష్ణ, అత్తి సత్యనారాయణ, బలరామకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు, చెరుకూరి రామారావు తదితరులు ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా అచ్చెన్నాయుడు కూడా అక్కడే ఉన్నారు.