Ganta Srinivasa Rao: చంద్రబాబు గురించి విజయసాయి, సజ్జల, బొత్స చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం?: గంటా

Vijayasai Reddy comments on Chandrababu is sign for what asks Ganta Srinivasa Rao
  • 2024 తర్వాత చంద్రబాబు కనుమరుగవుతారని విజయసాయి చెప్పారన్న గంటా
  • కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే వైసీపీ కుట్రలు బయటపడతాయని వ్యాఖ్య
  • చంద్రబాబు, లోకేశ్ లను పాతాళానికి తొక్కేస్తామని సజ్జల చెప్పారన్న గంటా
వైసీపీ నాయకులు బరి తెగించి చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో కుట్ర కోణం ఉన్నట్టు అనుమానించాల్సి వస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు నాయుడుకి 2023 చివరి ఏడాది... ఆ తర్వాత ప్రజలకు కనిపించకుండా కనుమరుగవుతారని నిన్న విజయసాయిరెడ్డి అనడం దేనికి సంకేతం... 2024లో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు కనిపించరని చెప్పడం వెనుక విజయసాయిరెడ్డి ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించారు. 

మరోవైపు చంద్రబాబు, లోకేశ్ లను పాతాళానికి తొక్కేస్తామని... మేం తలుచుకుంటే బతికి బట్టకట్టగలరా? అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరించడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలని అడిగారు. కొత్త అమావాస్య నాటికి టీడీపీ, జనసేన కనుమరుగై పోతాయని, లేకపోతే గుండు గీయించుకుంటానని మంత్రి బొత్స సత్యనారాయణ నెలరోజుల కిందట ప్రకటన చేశారని... ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు మీద వైసీపీ చాలా రోజులుగా కుట్ర చేస్తూ, ఒక ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నట్టు స్పష్టమవుతోందని అన్నారు. చంద్రబాబు, టీడీపీపై వైసీపీ చేస్తున్న కుట్రలు నిగ్గు తేల్చడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే... వైసీపీ కుట్ర కోణం, ఆ పార్టీ నిజస్వరూపం బయటపడతాయని చెప్పారు. 

'చంద్రబాబు రాజకీయంగా ఎదిగారని... మీరు ఎదగడానికే రాజకీయాల్లోకి వచ్చి నేషనల్ రికార్డు సృష్టించారని గంటా ఎద్దేవా చేశారు. కోర్టు హాజరు తప్పించుకోటానికి వేసిన పిటిషన్లు 320... స్టే పిటిషన్లు 158... కేసులు 31... 11 ఏళ్ల నుండి బెయిల్ పై హాయిగా తిరిగేస్తున్నారు... చట్టాల్లో వున్న వెలుసుబాటుని మీ కుటుంబాలు వాడుకున్నంతగా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంకెవరూ వాడుకొని ఉండరు.

73 సంవత్సరాల వయసు ఉన్న నాయకుడిని ఎలాగైనా హింసించి పైశాచిక ఆనందం పొందాలనే మనస్తత్వం... ఒక గొప్ప సుదీర్ఘ అనుభవమున్న నాయకుడిని అక్రమ కేసుల ద్వారా అరెస్టు చేసి, దానిని మంత్రుల స్థాయిలో ఉన్నవారు కూడా సెలెబ్రేట్ చేసుకుంటున్నారంటే రాష్ట్రంలో ద్వేష రాజకీయాలు ఏ స్థాయిలో పెంచేశారో ప్రజలు అర్థం చేసుకున్నారు... అయినా మీరందరూ న్యూమరాలజీ, జోతిష్యాలు బాగానే చెబుతున్నారు... 2024 తరువాత జైల్లో జోష్యం చెప్పి బ్రతికెయ్యవచ్చులే' అని గంటా అన్నారు. 

Ganta Srinivasa Rao
Chandrababu
Nara Lokesh
Telugudesam
Sajjala Ramakrishna Reddy
Botsa Satyanarayana
Vijayasai Reddy
YSRCP

More Telugu News