KTR: అక్టోబర్ 10లోపు నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. లేదంటే!: కేటీఆర్
- అక్టోబర్ 10లోపు నోటిఫికేషన్ రావడం అనుమానమేనని వ్యాఖ్య
- అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లేదా మేలో ఉండవచ్చుననే అభిప్రాయం
- ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టత వస్తుందన్న కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. అక్టోబర్ 10వ తేదీ లోపు నోటిఫికేషన్ వస్తేనే నిర్ణీత సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. ఈ లోగా నోటిఫికేషన్ రావడం అనుమానమే అన్నారు. అలా జరిగితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లేదా మే నెలలో జరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీసుకునే నిర్ణయం తర్వాత అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీకే లాభమన్నారు.
దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా జమిలి ఎన్నికలపై చర్చ సాగుతోన్న విషయం తెలిసిందే. ఎన్నికల ఖర్చు, ప్రజలకు ఇబ్బంది తగ్గించే ఉద్దేశ్యంలో భాగంగా జమిలి ఎన్నికల వైపు నరేంద్ర మోదీ సర్కార్ మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.