Ashok Babu: ఏఏజీ పొన్నవోలు కూడా చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటు: అశోక్ బాబు ఫైర్

Ashok Babu fires on AAG Ponnavolu Sudhakar Reddy
  • టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రెస్ మీట్
  • చంద్రబాబును విమర్శించిన ఏఏజీ పొన్నవోలుపై ఆగ్రహం
  • జగన్ కళ్లలో ఆనందం చూసేందుకే పొన్నవోలు వ్యాఖ్యలు చేశారన్న అశోక్ బాబు
అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటు అని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి అవినీతి కేసుల్లో ఐఏఎస్ లను బాధ్యులుగా చేసి నేడు చంద్రబాబు గారి కేసులో ఐఏఎస్ లను బాధ్యులుగా ఎందుకు చేయలేదు? అంటూ పొన్నవోలును ప్రశ్నించారు. 

చంద్రబాబును అరెస్ట్ చేయడమే జగన్మోహన్ రెడ్డి జీవిత ఆశయమా? సకల శాఖా సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి  అన్నింటికి మాట్లాడతారు... కానీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా చంద్రబాబు గారిని విమర్శించడం సిగ్గుచేటు అని అశోక్ బాబు మండిపడ్డారు. 

"జగన్ కళ్లల్లో ఆనందం చూసేందుకే సుధాకర్ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో ఏమీ జరగలేదని ఈడీ చెప్పింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో 3 ఏళ్ల పాటు 2,13,000 మంది విద్యార్ధులకు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం వాటా రూ.330 కోట్లలో  రూ.271 కోట్లు అవినీతి జరిగిందని వైసీపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. 

గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి సొమ్ము ఎటుపోయింది, ఎటు నుంచి వచ్చిందో సీబీఐ, ఈడీ స్పష్టంగా చెప్పాయి. మరి స్కిల్ స్కాంలో డబ్బు ఎటుపోయిందో పొన్నవోలు ఎందుకు చెప్పలేకపోతున్నారు. 

దీనిపై కేసు 2021లో ఫైల్ చేశారు... అప్పటి వరకు సిట్, సీఐడీ ఏం చేస్తున్నాయి? మొత్తం 36 మందిని నిందితులుగా చూపిస్తున్నారు. కాని ఎవరినైనా అరెస్టు చేశారా? చంద్రబాబు గారి పేరు ఎఫ్ఐఆర్ లో లేకపోయినా ఆయనను తీసుకువచ్చారు. రూ.271 కోట్లకు చట్ట ప్రకారం చంద్రబాబుదే బాధ్యత అని ఎలా చెబుతున్నారు?

ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి మీద ఏసీబీ కేసు ఫైల్ చేస్తే... ఆయన ఒక్కరినే ఎలా బాధ్యుడ్ని చేస్తారు?... ఐఏఎస్ అధికారులను ఎందుకు బాధ్యులుగా చేయరని వెళ్లింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి కాదా? ఆ కేసు డిస్మిస్ చేస్తే హైకోర్టు, తరువాత సుప్రీంకోర్టుకు వెళ్లింది నువ్వు కాదా? కేవలం పొన్నవోలు వలనే జగన్మోహన్ రెడ్డి కేసులో ఆరుగురు ఐఏఎస్ లు సస్పెండ్ అయ్యి జీవితాలను తలకిందులుగా చేసుకున్నారు. శ్రీలక్ష్మి,  భట్టాచార్య వంటి వారు అరెస్ట్ అయ్యారు. దానికి కారణం పొన్నవోలు సుధాకర్ రెడ్డి కాదా? ఆ బాధ్యత నేడు ఎందుకు వర్తించదని నిన్ను ప్రశ్నిస్తున్నాం. 

డిజైన్ టెక్ కు డబ్బులు చెల్లించిన ప్రేమ్ చంద్రా రెడ్డి తో పాటు ఎండీలను పొన్నవోలు ఎందుకు బాధ్యులుగా చేయలేదు? నాడు చేసిన పనిని నేడు ఎందుకు చేయలేకపోయారు? జైల్లో చంద్రబాబు గారికి అన్ని తానే ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. చట్టంలో ఉన్నవే ఇచ్చారు తప్ప కొత్తగా ఏం ఇచ్చారు? 

చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి నంద్యాల నుంచి హెలికాప్టర్ లో తెచ్చేవాళ్లమని సజ్జల అన్నారు. అయితే ఫ్లైట్ ఎందుకు పెట్టలేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఏ జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లలో వేల కోట్ల ప్రజాధనంతో తిరగడం లేదా? జగన్ రెడ్డీ... ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు వెంట్రుక కూడా పీకలేవు? జగన్మోహన్ రెడ్డీ... ఏళ్ల తరబడి బెయిల్ మీద ఉన్నావు. చంద్రబాబు గారిని ఆపడం నీ వల్ల కాదు. ఏపీ నుంచి భయటకు వెళ్లాలంటే జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ కావాలి. 

పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రజల సొమ్ము తింటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పరిహారం చెల్లించక తప్పదు. ప్రేమ్ చంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? కనీసం విట్ నెస్ గానైనా ఎందుకు పెట్టలేదు? 

చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ ను వైసీపీ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. అధికారం అనేది జగన్మోహన్ రెడ్డికి శాశ్వతం కాదు. టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి మళ్లీ అధికారంలోకి రావాలని కుటిల ప్రయత్నం చేస్తున్నారు. 

జగన్ రెడ్డి తల కింద తపస్సు చేసినా ఆయన మీద పెట్టిన ఏ ఒక్క కేసు నిలవలేదు. రాబోయే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు  ప్రమాణ స్వీకారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డికి చూసే దమ్ముందా?" అంటూ అశోక్ బాబు వ్యాఖ్యానించారు.
Ashok Babu
Ponnavolu Sudhakar Reddy
Chandrababu
Jagan
TDP
YSRCP

More Telugu News