Nannapaneni Rajakumari: ఒక్క చాన్స్ అంటూ వచ్చి కక్ష సాధిస్తారా... భోరున విలపించిన నన్నపనేని రాజకుమారి
- స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్
- 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
- చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించిన పోలీసులు
- నారా భువనేశ్వరిని చూస్తే బాధగా ఉందన్న నన్నపనేని
చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో టీడీపీ మహిళా నేత నన్నపనేని రాజకుమారి స్పందించారు. లోకేశ్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్న అక్కసుతోనే వైసీపీ సర్కారు చంద్రబాబుపై తప్పుడు కేసులు మోపిందని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపు చర్యేనని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.
"ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. అలాంటప్పుడు ఆ చాన్స్ ను సద్వినియోగం చేసుకోవాలి కదా. కానీ మీరేం చేస్తున్నారు... కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. యువగళం బ్రహ్మాండంగా జరుగుతుండడంతో, చంద్రబాబుపై ఇంత తొందరపడి చర్య తీసుకున్నారు. ఇలాంటి చర్యలతో యువగళం పాదయాత్రను ఆపేయగలమనుకుంటున్నారా? యువగళం మళ్లీ ప్రారంభమవుతుంది, చంద్రబాబు పర్యటనలు మళ్లీ జరుగుతాయి" అంటూ ధీమా వ్యక్తం చేశారు.
ఇక, చంద్రబాబు అర్ధాంగి భువనేశ్వరి గురించి చెబుతూ నన్నపనేని రాజకుమారి తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. ఇవాళ భువనేశ్వరి గారిని చూస్తే చాలా బాధ అనిపించిందని తెలిపారు. ఆమె ధైర్యంగా ఉండాలని చెబుతున్నామని అన్నారు. కొన్నిరోజుల్లోనే చంద్రబాబు మళ్లీ నవ్వుతూ అందరి మధ్యకు వస్తారని భావిస్తున్నామని చెబుతూ భోరున విలపించారు. మాట్లాడడం ఆపేసి వెక్కి వెక్కి ఏడ్చారు.