Justin Trudeau: భారత్ సాయాన్ని తిరస్కరించిన కెనడా ప్రధాని!
- సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన కెనడా ప్రధాని విమానానికి మరమ్మతు పూర్తి
- మంగళవారం స్వదేశానికి పయనమైన ప్రధాని జస్టిన్ ట్రూడో
- ఎయిర్‌పోర్టులో ఆయనకు వీడ్కోలు పలికిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
- అంతకుమునుపు, వాయుసేన విమానంలో ట్రూడోను కెనడాకు పంపిస్తామన్న భారత్
- భారత ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ట్రూడో
తన అధికారిక విమానంలో సాంకేతిక లోపం కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చినా ఆయన సున్నితంగా తిరస్కరించారని భారత వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. భారత వాయుసేన విమానంలో ఆయనను స్వదేశానికి తరలిస్తామని భారత్ ప్రతిపాదించగా ఆయన తన దేశం నుంచి వస్తున్న విమానం కోసం నిరీక్షిస్తానని పేర్కొన్నట్టు తెలిపాయి.
జీ20 సమావేశాలు ముగించుకుని స్వదేశానికి బయలుదేరేందుకు ప్రధాని ట్రూడో సిద్ధమవుతుండగా చివరి నిమిషంలో ఆయన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో, ట్రూడో ప్రయాణం దాదాపు రెండు రోజుల పాటు వాయిదా పడింది. కెనడా నుంచి ట్రూడో కోసం బయలుదేరిన మరో విమానాన్ని కూడా అనుకోని పరిస్థితుల్లో లండన్‌కు మళ్లించాల్సి వచ్చింది.
ఈలోపు, ఇండియాలోని విమానానికి మరమ్మతు పూర్తి కావడంతో మంగళవారం ప్రధాని ట్రూడో స్వదేశానికి తిరిగెళ్లారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎయిర్‌పోర్టులో ఆయనకు వీడ్కోలు పలికారు. భారత్‌లో నిర్వహించిన జీ20 సదస్సులో పాల్గొనేందుకు ట్రూడోకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు, భారత్‌లో కెనడా ప్రధాని దౌత్యపరమైన వైఫల్యం చవిచూశారంటూ కెనడాలోని ప్రతిపక్షాలు ఆయనపై దుమ్మెత్తిపోయడం ప్రారంభించాయి.