Nara Lokesh: జైల్లో చంద్రబాబును చూసి పవన్ చాలా ఆవేదనకు గురయ్యారు: లోకేశ్
- ఇవాళ రాజమండ్రి వచ్చిన పవన్ కల్యాణ్
- లోకేశ్, బాలకృష్ణలతో కలిసి జైల్లో చంద్రబాబుతో ములాఖత్
- అనంతరం చంద్రబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన పవన్
- పవన్ కల్యాణ్ కు వీడ్కోలు పలికిన అనంతరం లోకేశ్, బాలయ్య ప్రెస్ మీట్
రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబును పవన్ కల్యాణ్ ఈ మధ్యాహ్నం పరామర్శించడం తెలిసిందే. అనంతరం వచ్చే ఎన్నికల్లో పొత్తుపై ప్రకటన చేసిన పవన్ కల్యాణ్... చంద్రబాబు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. ఈ పర్యటనలో పవన్ వెంట నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. పవన్ కు వీడ్కోలు పలికిన అనంతరం లోకేశ్, బాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యాచరణలోని పలు అంశాలను ప్రజలకు వివరించేందుకే చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారని, కానీ ప్రభుత్వం అన్యాయంగా కేసు పెట్టి అరెస్ట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఏపీలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో తెలుగువాళ్లు ఉన్న ప్రతిచోట నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారని లోకేశ్ వెల్లడించారు.
"హైదరాబాద్ కు ఓ గుర్తింపు తీసుకువచ్చింది చంద్రబాబు. నాడు సైబర్ టవర్స్ కట్టి సైబరాబాద్ గా మార్చారు. లక్షల మంది ఇవాళ ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.... అందుకు కారణం చంద్రబాబు. ఇవాళ హైదరాబాదులో ఎకరం రూ.100 కోట్లు అమ్మారంటే ఆనాడు చంద్రబాబు వేసిన పునాదే కారణం. అలాంటి వ్యక్తిపై ఎలాంటి ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలతో కేసు పెట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన రాజమండ్రి జైలు భవనంలోనే ఆయనను ఖైదీగా చేశారు.
అమరావతి కట్టినందుకా ఆయనను జైలుకు పంపించారు, పోలవరం కట్టినందుకా ఆయనను జైలుకు పంపించారు, కియా పరిశ్రమను తీసుకువచ్చినందుకా ఆయనను జైలుకు పంపించారు. దాదాపు 100 సంక్షేమ పథకాలు తీసుకువచ్చినందుకా జైలుకు పంపారు" అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, పవన్ కల్యాణ్ రాజమండ్రి వచ్చి చంద్రబాబును కలవడంపైనా లోకేశ్ వివరణ ఇచ్చారు. "ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను... రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలిసి మాట్లాడాం. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం మొదలుపెట్టాలని నిర్ణయించాం.
చట్టాలను అమలు చేయాల్సిన అధికారులు చట్టాలను చుట్టాలుగా చేసుకుంటున్న తీరుపై పౌరయుద్ధం జరిపి తీరుతాం... ఎవరినీ వదిలిపెట్టేది లేదు. 2024లో అందరం కలిసి పోరాటం చేయాలని నిశ్చయించాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది అత్యంత కీలక నిర్ణయం. భావితరాల కోసం తీసుకున్న నిర్ణయం ఇది. రాష్ట్ర ప్రజలు హాయిగా, చల్లగా బతికేందుకు తీసుకున్న నిర్ణయం.
అందుకోసం అటు జనసేన నుంచి, ఇటు టీడీపీ నుంచి ఒక కమిటీ వేయాలని నిర్ణయించాం. రాబోయే రోజుల్లో ఈ యుద్ధాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది చర్చిస్తాం. ఈ సైకోని శాశ్వతంగా తాడేపల్లి కొంపలో పెట్టి బయటి నుంచి తాళం వేసే ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తాం" అని లోకేశ్ వివరించారు.
చంద్రబాబు సింహం వంటివారని, ఇవాళ ఆయన లోపలున్నా జగన్ కు చెమటలు పట్టిస్తున్నారని, సింహం లోపలున్నా, బయటున్నా ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.
"ఇవాళ పవన్ కల్యాణ్ జైల్లోకి వచ్చి చంద్రబాబును చూడగానే చాలా ఆవేదన చెందారు. పవన్ హైటెక్ సిటీ నుంచి ఇక్కడికి వచ్చారు. అక్కడ వందలాది మంది నిరసనలు తెలుపుతుండడాన్ని ఆయన చూశారు. చంద్రబాబు నాడు వేసిన పునాది వల్లే లక్షలాది మందికి ఉపాధి దొరుకుతోందని గుర్తించారు. చంద్రబాబు అవినీతి చేయదలుచుకుంటే ఆనాడే లక్షల కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా, కనీసం ఒక గజం స్థలం కూడా కొనుక్కోలేదు అని ఇవాళ పవన్ వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తిపై ఇవాళ పనికిమాలిన అవినీతి ఆరోపణలు చేసి బంధించడం బాధాకరమని అన్నారు" అని లోకేశ్ వివరించారు.