Jagan: కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం
- సెప్టెంబరు 18 నుంచి కాణిపాకం క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు
- తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన ఆలయ వర్గాలు
- సీఎంకు వేదాశీర్వచనం అందించిన వరసిద్ధి వినాయక ఆలయ అర్చకులు
ఈ నెల 18 నుంచి కాణిపాకం వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అక్టోబరు 8 వరకు మొత్తం 21 రోజుల పాటు వినాయక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, కాణిపాకం బ్రహ్మోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్ ను ఆలయ వర్గాలు నేడు ఆహ్వానించాయి. పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు, ఆలయ చైర్మన్ అగరం మోహన్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేశ్ ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు. అర్చకులు సీఎం జగన్ కు వేదాశీర్వచనం అందించారు. వరసిద్ధి వినాయకుడి చిత్రపటాన్ని సీఎంకు బహూకరించారు.