BJP: మూడు పార్టీల పొత్తు అనేది పవన్ కల్యాణ్ అభిప్రాయం: ఏపీ బీజేపీ
- ఏ పార్టీతో పొత్తు అనేది కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని వెల్లడి
- పొత్తుల అంశం పార్టీ నాయకత్వమే చూసుకుంటుందన్న బీజేపీ
- ప్రస్తుతం ఏపీలో జనసేనతో పొత్తు కొనసాగుతోందన్న కమలదళం
వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని, బీజేపీ కూడా కలిసి రావాలన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ కమలదళం స్పందించింది. ఈ మేరకు బీజేపీ గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది. పొత్తుల అంశం తమ పార్టీ కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని స్పష్టం చేసింది.
ఏ పార్టీతో పొత్తు అనేది తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయిస్తారని వెల్లడించింది. ప్రస్తుతం ఏపీలో జనసేనతో పొత్తు కొనసాగుతోందని పేర్కొంది. ఏపీలో బీజేపీతో పొత్తు ఉంటుందని పవన్ చెప్పారని, కానీ ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు అనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేసింది.
ఈ రోజు మధ్యాహ్నం రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పవన్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెబుతూనే, బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.