K Kavitha: సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవిత పిటిషన్.. కాసేపట్లో ప్రగతి భవన్ కు వెళ్లనున్న కవిత

Kavitha files petition in Supreme Court requesting to cancel ED summons

  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు ఈడీ సమన్లు
  • శుక్ర లేదా శనివారాల్లో ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశం
  • ఈడీ సమన్లను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంలో కవిత పిటిషన్
  • తనపై చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని విన్నపం
  • కాసేపట్లో తన తండ్రిని కలవనున్న కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. శుక్రవారం లేదా శనివారం ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఆమెకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ సమన్లను రద్దు చేయాలంటూ సుప్రీంలో పిటిషన్ వేశారు. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలను జారీ చేయాలని కోరారు. కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరపనుంది. 

లిక్కర్ స్కామ్ లో కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం ఇది నాలుగోసారి. గత మార్చి నెలలో ఆమెకు వరుసగా నోటీసులు జారీ చేసింది. మార్చి 16, 20, 21 తేదీల్లో మూడు సార్లు ఆమెను ప్రశ్నించింది. గత ఏడాది చివర్లో ఇదే కేసులో హైదరాబాదులోని ఆమె నివాసంలో ఆమెను విచారించింది. 

మరోవైపు ఈడీ నోటీసుల నేపథ్యంలో కవిత నిజామాబాద్ నుంచి ఆమె హైదరాబాద్ కు చేరుకున్నారు. సమన్లు అందిన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ... ఏం చేయాలనే దానిపై తన న్యాయబృందం స్పందిస్తుందని చెప్పారు. రాజకీయ కక్షతోనే తనకు నోటీసులు పంపారని మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న ఎన్నికల వాతావరణం నేపథ్యంలోనే మళ్లీ తనను టార్గెట్ చేశారని చెప్పారు. మరోవైపు కాసేపట్లో ప్రగతి భవన్ కు కవిత వెళ్లనున్నారు. తన తండ్రి, సీఎం కేసీఆర్ ను కలవనున్నారు.

  • Loading...

More Telugu News