Himantha: అసోం సీఎం వర్సెస్ కాంగ్రెస్ ఎంపీల మధ్య ట్విట్టర్ వార్

Twitter war inbetween Assam CM Himantha and Congress MP Gourav Gogoi
  • హిమంత బిశ్వ శర్మ భార్య కంపెనీకి కేంద్ర సబ్సిడీపై ఆరోపణలు
  • కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పై పరువునష్టం కేసు పెడతామన్న హిమంత
  • కోర్టుకు వెళితే ఈ కేసులో అన్ని విషయాలు బయటకు వస్తాయని ఎంపీ వ్యాఖ్య
అసోంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ కంపెనీ విషయంలో కాంగ్రెస్ ఎంపీ సంచలన ఆరోపణలు చేశారు. రినికి భుయాన్ కంపెనీ కేంద్రం నుంచి సబ్సిడీ రూపంలో రూ.10 కోట్లు తీసుకుందని, ఇది అధికార దుర్వినియోగమేనని గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. దీనిపై రినికి భుయాన్ తో పాటు సీఎం హిమంత కూడా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ఎంపీపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించడంతో గౌరవ్ గొగోయ్ కూడా స్పందించారు. సీఎం హిమంత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, కనీసం అలా చేయడం వల్ల ఈ అవినీతికి సంబంధించిన అన్ని వివరాలు ప్రజలకు తెలుస్తాయని అన్నారు. తప్పకుండా కోర్టుకు వెళ్లాలని సీఎం హిమంతకు సూచించారు.

గౌరవ్ ట్వీట్ పై హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ.. తాను ఏం చేయాలనేది కాంగ్రెస్ ఎంపీ నిర్ణయించలేరని అన్నారు. అసెంబ్లీకి వెళ్లాలా? లేక కోర్టుకు వెళ్లాలా? అనేది తానే నిర్ణయించుకుంటానని వివరించారు. అదే సమయంలో 2010 నుంచి గౌరవ్ కుటుంబంతో తమ కుటుంబానికి ఉన్న విభేదాలను సీఎం హిమంత గుర్తుచేశారు. 2016 లో, 2021లోనూ కోర్టుకు వెళ్లి గెలిచిన విషయాన్ని తన ట్వీట్ లో ప్రస్తావించారు. ఇప్పుడు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి మరోమారు విజయం సాధిస్తానని హిమంత పేర్కొన్నారు.
Himantha
Assam CM
Congress MP
MP Gourav Gogoi
Assam CM wife

More Telugu News