Jahnavi Kandula: అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు యువతికి మరణానంతర డిగ్రీ పట్టా ప్రదానం

Indian Student Killed By Speeding US Police Car To Get Degree Posthumously

  • అమెరికాలో పోలీసు కారు ఢీకొనడంతో తెలుగు యువతి జాహ్నవి మృతి
  • ఘటనపై సంఘీభావం ప్రకటించిన నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ 
  • ఈ దుర్ఘటనతో ప్రభావితమైన భారతీయ విద్యార్ధులందరికీ అండగా ఉంటామని హామీ
  • యువతికి మరణానంతర డిగ్రీ ప్రదానం చేయనున్నట్టు ప్రకటన

పోలీసు కారు ఢీకొనడంతో అమెరికాలో మరణించిన తెలుగు యువతి జాహ్నవి కందులపై స్థానిక పోలీసులు చులకనగా మాట్లాడటం ఇరు దేశాల్లోనూ తీవ్ర దుమారం రేపుతోంది. నిందితులపై తక్షణం చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేయగా బాధ్యులపై కఠిన చర్యలు తప్పవంటూ అమెరికా హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జాహ్నవి చదువుకుంటున్న నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ కూడా స్పందించింది. జాహ్నవి కుటుంబానికి తమ సంతాపం తెలియజేసిన యూనివర్సిటీ.. యువతికి మరణానంతర డిగ్రీ ప్రదానం చేసేందుకు ముందుకొచ్చింది. జాహ్నవి డిగ్రీ పట్టాను ఆమె కుటుంబానికి అందజేస్తామని వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 

‘‘జాహ్నవి మరణం, తదనంతర పరిణామాలతో మా క్యాంపస్‌లో భారతీయులందరూ కలత చెందారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ సంఘీభావం ప్రకటిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుతో బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం’’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా, మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న వారిని ఆదుకునేందుకు ఓ హెల్ప్‌ లైన్ కూడా ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జహ్నవి కందుల సౌత్ లేక్ యూనియన్ ప్రాంతంలోని యూనివర్సిటీ క్యాంపస్‌లో మాస్టర్స్ చేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ ఏడాది జనవరి 23న రోడ్డు దాటుతుండగా ఆమెను పోలీసు కారు ఢీకొట్టడంతో దుర్మరణం చెందింది. స్టూడెంట్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్ కింద ఆమె 2021లో బెంగళూరు నుంచి అమెరికాకు వెళ్లింది. ఈ డిసెంబర్‌లో చదువు పూర్తి కావాల్సి ఉండగా ఇంతలోనే దారుణం జరిగిపోయింది.

  • Loading...

More Telugu News