thulasi reddy: పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటన, చంద్రబాబు అరెస్ట్‌పై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి స్పందన

ThulasiReddy responds on Pawan Kalyan alliance announcment

  • చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరికాదన్న తులసిరెడ్డి
  • అవినీతి జరిగిందా? లేదా? అన్నది కోర్టులో తేలుతుందన్న కాంగ్రెస్ నేత
  • అరెస్ట్‌ను తప్పుబట్టడం లేదని... అరెస్ట్ చేసిన విధానాన్ని తప్పుబడుతున్నామని స్పష్టీకరణ
  • ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీతో వెళ్తానని పవన్ చేసిన ప్రకటన పాతదేనని వ్యాఖ్య!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరికాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. టీడీపీ-జనసేన పొత్తుపై జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పింది కొత్త విషయమేమీ కాదన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అర్ధరాత్రి సమయంలో మాజీ సీఎంను అరెస్ట్ చేసిన విధానం చూస్తుంటే రాజకీయ కక్షలాగే కనిపిస్తోందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తప్పు జరిగిందా? అవినీతి చేశారా? లేదా? అనేవి కోర్టులో తెలుస్తుందన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పుచేసిన వారిని ఎవర్నైనా సరే అరెస్ట్ చేయాల్సిందే అన్నారు. కానీ అరెస్ట్ చేసిన విధానం మాత్రం సరికాదనేది తమ అభిప్రాయమన్నారు.

ఆ కేసు రెండేళ్లుగా ఉందని, చంద్రబాబు కూడా ఇక్కడ ఉన్నారని, కాబట్టి అర్ధరాత్రి సమయంలో అలా వెళ్లి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. అరెస్ట్ చేసిన విధానం ఏమాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా లేదన్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, తాము అరెస్టును ఖండించడం లేదని, అలాగే అవినీతి గురించి చెప్పడం లేదని, అరెస్ట్ చేసిన విధానాన్ని మాత్రమే తప్పుబడుతున్నామన్నారు. అవినీతి అనే విషయాన్ని న్యాయస్థానాలు చూసుకుంటాయన్నారు.

టీడీపీ-జనసేన పొత్తుపై పలుమార్లు చెప్పారని, ఇప్పుడు పునరుద్ఘాటించారన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దనేది తన సిద్ధాంతమని, కాబట్టి కలిసి పోటీ చేస్తామని రెండుమూడుసార్లు చెప్పారని, కాబట్టి అదేం కొత్త విషయం కాదన్నారు. కానీ ఏది ఏమైనా ఏపీ బాగుపడాలంటే ప్రత్యేక హోదా మాత్రం రావాలన్నారు. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ అమలు కావాలని, పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలని, చట్టంలోని హామీలు అమలు కావాలన్నారు. ఈ హామీలు నెరవేరాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బీజేపీ అంటే బీ అంటే బాబు, జే అంటే జగన్, పీ అంటే పవన్ అని సరికొత్త అర్థాన్ని చెప్పారు. ఈ మూడు ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబుకు, పవన్‌కు, జగన్‌కు.. ఈ ముగ్గురిలో ఎవరికి ఓటేసినా బీజేపీకి వేసినట్లేనని, వీరికి ఓటేస్తే మన కన్నుతో మనం పొడుచుకున్నట్లే అన్నారు. జగన్ మాట తప్పడు మడమ తిప్పడని చెబుతుంటారని, కానీ అగ్రిగోల్డ్ విషయంలో మడమ తిప్పారన్నారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ న్యాయసమ్మతమైనదన్నారు. వారికి న్యాయం చేయాలన్నారు.

  • Loading...

More Telugu News