Vangalapudi Anitha: అలాంటి జగన్‌కు రాజకీయాలు, సీఎం కుర్చీ అవసరమా? వైసీపీ సిగ్గుపడాలి: వంగలపూడి అనిత
- టీడీపీ అంటే వైసీపీకి అంత భయం ఎందుకన్న టీడీపీ నాయకురాలు
- జగన్ విజయనగరం వెళ్తున్నారని టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారని ఆగ్రహం
- చంద్రబాబును ఆర్థిక నేరస్థుడు అంటే జగన్‌ను అపర ఆర్థిక నేరస్థుడు అనాలా? అని ప్రశ్న
- మహా అయితే ఐదు నెలలు ఇష్టం వచ్చినట్లు మొరగండని ఎద్దేవా
పరదాలు లేకుండా, పోలీసులు లేకుండా బయటకు వచ్చి కనీసం ఒక ప్రారంభోత్సవం చేయలేని జగన్‌కు రాజకీయాలు అవసరమా? ముఖ్యమంత్రి కుర్చీ అవసరమా? అని టీడీపీ నేత వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ధర్నాకు మాత్రమే కాదు... కనీసం దుర్గమ్మతల్లి దర్శనం చేసుకొని వస్తామన్నా ఇబ్బంది పెట్టే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. టీడీపీ అంటే వైసీపీకి ఎందుకంత భయమన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలిసి హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల నుండి మహిళల వరకు అందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఈ రోజు జగన్ విజయనగరం వెళ్తున్నారని అక్కడి టీడీపీ నేతలను, ఎస్సీ, ఎస్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారని ఆరోపించారు. పోలీసులు లేకుండా కనీసం బయటకు కూడా రాలేని జగన్‌కు రాజకీయాలు, సీఎం పదవి అవసరమా? అని ప్రశ్నించారు. అలాంటి వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలు చేయడమా? అని నిప్పులు చెరిగారు.
చంద్రబాబును ఆర్థిక నేరస్థుడని ఓ వెధవ చెబుతున్నాడని, ఆధారాలు, సాక్ష్యాలు లేకుండానే రూ.200 కోట్ల అభియోగాలతో చంద్రబాబును జైల్లో కూర్చోబెట్టి ఆర్థిక నేరస్థుడని చెబుతున్నారని, మరి అలాంటప్పుడు లక్ష కోట్లు దోచుకొని, రూ.45వేల కోట్ల ఆస్తులు ఈడీ అటాచ్ చేయగా, 16 నెలలు జైల్లో చిప్పకూడు తిని కూడా ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చున్న జగన్‌ను అపర ఆర్థిక నేరస్థుడు అనాలా? అమూల్ బేబీ అనాలా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు జగన్ అంత అమూల్ బేబీలా కనిపిస్తున్నాడా? అని ఎద్దేవా చేశారు.
అప్పుడు వేలకోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తి ఇప్పుడు కూడా ఇసుక, భూమి, మద్యం పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. అలాంటి జగన్‌ను మీ నాయకుడు అని చెప్పుకోవడానికి వైసీపీ నేతలు సిగ్గుపడాలన్నారు. ఏపీకి మంచి జరగాలనే ఉద్ధేశ్యంతో టీడీపీ, జనసేన కలిసి వస్తున్నాయని, కానీ నోటీకి వచ్చినట్లు పవన్‌ను దత్తపుత్రుడు అనడంతో పాటు చంద్రబాబు, లోకేశ్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. మహా అయితే ఐదు నెలలు ఉంటారేమో.. మీకు నచ్చినట్లు మొరగండి అని అనిత వ్యాఖ్యానించారు.