vangalapudi anitha: రోజా దయచేసి అర్థం చేసుకోవాలి.. గౌరవంగా చెబుతున్నా: వంగలపూడి అనిత
- చంద్రబాబు లేకుంటే రోజాకు రాజకీయాల్లో అడ్రస్ లేదన్న వంగలపూడి అనిత
- పక్కన అవినీతిపరుడిని పెట్టుకొని మీరే అలా మాట్లాడితే మేం ఎలా మాట్లాడాలని ప్రశ్న
- వైసీపీ పరిస్థితి బురదలో పంది దొర్లినట్లుగా ఉందని వ్యాఖ్య
- కొడాలి నాని ఏ ఒక్కరోజు ప్రజా సంక్షేమం గురించి మాట్లాడలేదని విమర్శ
తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు లేకుంటే మంత్రి రోజాకు రాజకీయాల్లో అడ్రస్ కూడా లేదని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. శుక్రవారం బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ... చంద్రబాబు లేకుంటే రోజా ఈ పాటికి ఎక్కడ ఉండేదో కూడా అర్థం కాకపోయేదన్నారు. రాజకీయాల్లో ఓనమాలు దిద్దించిన వ్యక్తి ఒకరు, సినిమా జీవితం ఇచ్చిన వ్యక్తి ఒకరు అలాంటి వారి గురించి ఇష్టారీతిన మాట్లాడే రోజాకు సభ్యత, సంస్కారం ఉన్నాయా? అని ప్రశ్నించారు. మీకు ప్రజల్లోకి రావడానికి ధైర్యం లేదని, పోలీసులను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని రోజాపై నిప్పులు చెరిగారు.
పోలీసులు లేకుంటే జగన్ జీరో అన్నారు. పక్కన అవినీతిపరుడిని పెట్టుకొని, మీరూ అవినీతిలో కూరుకుపోయి ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు ఊడుతుందో తెలియని పార్టీతో, ఎప్పుడు ఇంట్లో ఉంటాడో... ఎప్పుడు చంచల్‌గూడ జైలుకు వెళ్తాడో తెలియని వ్యక్తితో ఉండే రోజా వంటి వారే అంత ధైర్యంగా మాట్లాడుతుంటే నీతి, నిజాయతీ, ధైర్యం కలిగిన తాము ఎలా మాట్లాడాలన్నారు. 'రోజా దయచేసి అర్థం చేసుకోవాలి.. నేను గౌరవంగా చెబుతున్నాను.. ఇలాగే మాట్లాడితే ఇంట్లో నుండి బయటకి రాలేవ్.. నువ్వే కాదు.. నీ పిల్లలూ బయటకు రాలేరు, అది అర్థం చేసుకొని మాట్లాడాలి' అన్నారు.
వైసీపీ పరిస్థితి బురదలో దొర్లిన పంది మాదిరిగా ఉందన్నారు. పంది బురదలో దొర్లుతూ అదే స్వర్గం అనుకుంటుందని, ఆ తర్వాత బయటకు వచ్చి ఇతరులకు ఆ బురదను పూసి, మీకు బురద అంటిందని చెబుతుందని, ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలాగే ఉందన్నారు. వారు బురదలో ఉండి, తమకు అంటించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కొడాలి నాని వంటి వారు మంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు.. ఎప్పుడూ ప్రజాసంక్షేమం గురించి మాట్లాడలేదన్నారు. తిట్టడానికే మంత్రి పదవులు తీసుకున్న ఏకైక మంత్రి ఎవరైనా ఉన్నారా? అంటే అది కొడాలి నాని అని ఎద్దేవా చేశారు.