irom sharmila: చంద్రబాబునాయుడి అరెస్ట్‌పై ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల స్పందన
- దార్శనికత కలిగిన ప్రజానాయకుడిగా చంద్రబాబు ఖ్యాతి గడించారన్న షర్మిల
- చంద్రబాబు అరెస్ట్‌ను తనతో పాటు అందరూ ఖండించాలని వ్యాఖ్య
- సుదీర్ఘకాలం జైళ్లలో, గృహనిర్బంధం ఎదుర్కొంటున్న తనకు ఖైదీల పట్ల సానుభూతి ఉందని వ్యాఖ్య
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇరోమ్ షర్మిల స్పందించారు. పదహారేళ్ల పాటు జైలుశిక్షను, గృహనిర్బంధాన్ని ఎదుర్కొంటున్న తనకు రాజకీయ ఖైదీల పట్ల సానుభూతి ఉందన్నారు. చంద్రబాబునాయుడు ఒక దార్శనికత కలిగిన ప్రజానాయకుడిగా ఎంతో ఖ్యాతి గడించారన్నారు. అలాంటి చంద్రబాబును అక్రమంగా నిర్బంధించడాన్ని తాను ఖండిస్తున్నానని, ఈ చర్యను అందరూ ఖండించాల్సిందే అన్నారు.
ఒకవేళ దేశవ్యాప్తంగా రాజకీయ నేతల అవినీతికి వ్యతిరేకంగా సహేతుకమైన దర్యాఫ్తు జరిగితే ఈడీ ఇంత వరకు ఒక్క బీజేపీ నాయకుడిపై కూడా నేరం ఎందుకు మోపలేదో చెప్పాలన్నారు. ఇదంతా తన రాజకీయ ప్రత్యర్థులను నిర్వీర్యం చేసేందుకు ప్రధాని మోదీనే చేస్తున్నారని స్పష్టమవుతోందన్నారు.
ముఖ్య నేతలను అలా అవినీతి ముద్రవేసి అణచివేయకూడదన్నారు. ఒకరిద్దరు మాత్రమే కాదని, ఎంతోమంది రాజకీయ ఖైదీలుగా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారన్నారు. ప్రజాస్వామ్యం, మానవహక్కులను గౌరవించి ప్రధాని మోదీ వారందర్నీ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.