Team India: బంగ్లాదేశ్ తో ఆసియా కప్ మ్యాచ్... కష్టాల్లో భారత్
- ఆసియా కప్ లో నేడు చివరి లీగ్ మ్యాచ్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్
- 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు
- భారీ లక్ష్యఛేదనలో తడబడిన భారత్
- 94 పరుగులకే 4 వికెట్లు డౌన్
ఆసియా కప్ ఫైనల్ కు ముందు చివరి లీగ్ మ్యాచ్ ప్రాక్టీస్ లా ఉంటుందని భావించిన భారత్ కు బంగ్లాదేశ్ గట్టి పోటీ ఇస్తోంది. ఇవాళ భారత్, బంగ్లాదేశ్ మధ్య ఆసియా కప్ సూపర్-4 దశ చివరి లీగ్ పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా, బంగ్లాదేశ్ బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెరీర్ లో తొలి వన్డే ఆడుతున్న బంగ్లాదేశ్ యువ పేస్ బౌలర్ టాంజిమ్ హసన్ సకీబ్ ఆరంభంలోనే 2 వికెట్లు తీసి భారత్ ను దెబ్బకొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (0), తిలక్ వర్మ (5) ఇద్దరూ టాంజిమ్ కు వికెట్లు అప్పగించారు.
ఆ తర్వాత కేఎల్ రాహుల్ (19)ను మహెదీ హసన్ అవుట్ చేయగా, ఇషాన్ కిషన్ (5)ను మెహదీ హసన్ మిరాజ్ అవుట్ చేశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 31 ఓవర్లలో 4 వికెట్లకు 133 పరుగులు. రోహిత్ సేన గెలవాలంటే ఇంకా 19 ఓవర్లలో 133 పరుగులు చేయాలి.
ఓపెనర్ శుభ్ మాన్ గిల్ అర్థసెంచరీ పూర్తి చేసుకుని నిలకడగా ఆడుతున్నాడు. అతడికి సూర్యకుమార్ యాదవ్ నుంచి చక్కని సహకారం లభిస్తోంది. గిల్ 71, సూర్య 23 పరుగులతోనూ ఆడుతున్నారు.