Samantha: ‘పంజా’ దర్శకుడితో సల్మాన్​ ఖాన్​ సినిమా.. హీరోయిన్‌గా సమంత?

Samantha might Romance with Salman Khan in Karan johar movie
  • కరణ్ జొహార్ నిర్మాణంలో రానున్న సినిమా
  • ఖుషి చిత్రంతో హిట్ సొంతం చేసుకున్న సామ్
  • పుష్పలో ఐటమ్ సాంగ్, ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో హిందీలో గుర్తింపు
విజయ్ దేరకొండ సరసన హీరోయిన్‌గా నటించిన సమంత ‘ఖుషి’ చిత్రంతో హిట్ సొంతం చేసుకుంది. మయోసైటిస్‌తో బాధపడుతున్న ఆమె ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం సమంత విదేశాల్లో విహారయాత్రలో ఉంది. ఏడాది విరామం పూర్తి కాకముందే సమంతకు ఓ భారీ బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. పుష్ప చిత్రంలో ప్రత్యేక పాటతో పాటు, ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌తో ఉత్తరాది ప్రేక్షకులకు చేరువైంది. హాలీవుడ్ వెబ్ సిరీస్‌ ‘సిటాడెల్’ హిందీ వెబ్ సిరీస్‌లోనూ నటించింది. ఈ సిరీస్ విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు జోడీగా నటించే ఆఫర్ సమంత ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ‘పంజా’ సినిమాను తెరకెక్కించిన విష్ణువర్ధన్ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా, కరణ్ జొహార్ ఓ భారీ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌ గా సమంత పేరు తెరపైకి వచ్చింది. షారుక్ ఖాన్, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా ఇటీవల వచ్చిన ‘జవాన్‌’ మంచి విజయం సాధించింది. ఇందులో షారుక్, నయన్ జంటకు మంచి పేరు వచ్చింది. దాంతో సల్మాన్ సినిమాలో దక్షిణాది హీరోయిన్‌ అయితే బాగుంటుందని కరణ్ జొహార్ భావిస్తున్నారని తెలుస్తోంది. సమంతతో పాటు త్రిష, అనుష్క పేర్లను పరిశీలిస్తున్నట్టు బాలీవుడ్ సమాచారం. అయితే, సమంతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Samantha
Salman Khan
Karan Johar
Pawan Kalyan
panja movie
Bollywood

More Telugu News