Jasprit Bumrah: బుమ్రా సేవలను భారత్ పొదుపుగా వాడుకోవాలి: శ్రీలంక క్రికెటర్ సూచన
- బుమ్రా యాక్షన్ ఎంతో ప్రత్యేకమైనదన్న చమిందావాస్
- అలాంటి వారు అన్ని ఫార్మాట్లలోనూ ఆడకూడదన్న అభిప్రాయం
- సరైన ఫార్మాట్ గుర్తించి దానికే పరిమితం చేయాలన్న సూచన
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలను భారత్ పొదుపుగా వాడుకోవాలని శ్రీలంక లెజండరీ, మాజీ ఫాస్ట్ బౌలర్ చమిందా వాస్ సూచించారు. గాయాల బెడద తప్పించుకునేందుకు, సుదీర్ఘకాలం పాటు బుమ్రా సేవలు వినియోగించుకోవడానికి వీలుగా అతడిని అన్ని ఫార్మాట్లలో ఆడించకపోవడమే సరైనదన్నాడు. బుమ్రా విషయంలో బీసీసీఐ జాగ్రత్తగా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించాడు.
‘‘బుమ్రా వంటి ఆటగాళ్ల యాక్షన్ ఎంతో భిన్నమైనది. అలాంటి ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాంటి వారు అన్ని ఫార్మాట్లలోనూ పాల్గొనకూడదు. వారికి అనుకూలమైన ఫార్మాట్ ఏదో గుర్తించి, దాని వరకే పరిమితం చేయాలి’’ అని చమిందా వాస్ పేర్కొన్నాడు. బుమ్రా వంటి ఆటగాళ్ల నైపుణ్యాలు అసాధారణమైనవిగా అభిప్రాయపడ్డాడు.
వాస్ వ్యాఖ్యల్లో వాస్తవం క్రికెట్ అభిమానులకు అర్థమయ్యే ఉంటుంది. బుమ్రా స్ట్రెస్ ఫ్రాక్చర్ కారణంగా 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఆగస్ట్ వరకు ఆటకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. అంతకుముందు కూడా అతడు ఎన్నో గాయాలను ఎదుర్కొన్నాడు. 2022 టీ20 వరల్డ్ కప్ కు, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అందుబాటులో లేకుండా పోయాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రానున్న వన్డే ప్రపంచకప్ లో నూరు శాతం తమ ఫలితాలు చూపిస్తారన్న అభిప్రాయాన్ని వాస్ వ్యక్తం చేశాడు.