Himanta Sarma: కాంగ్రెస్-అస్సాం సీఎం మధ్య ఎక్స్ వార్.. కారణం ఈ వీడియోనే!

Seems Congress has sold Northeast to Neighbouring Country Slams Himanta Sarma
  • కాంగ్రెస్ యానిమేటెడ్ వీడియోపై హిమంత బిశ్వశర్మ తీవ్ర స్పందన
  • వీడియో స్క్రీన్‌షాట్లను షేర్ చేస్తూ విమర్శలు
  • చూస్తుంటే ఈశాన్య ప్రాంతాన్ని కాంగ్రెస్ రహస్యంగా అమ్మేసినట్టు ఉందని ఎద్దేవా
  • సీఎం కుటుంబ సభ్యుల భూ ఒప్పందాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇండియా పటంలో ఈశాన్య ప్రాంతం కనిపించకపోవడంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై విరుచుకుపడ్డారు. చూస్తుంటే ఈశాన్య ప్రాంతం మొత్తాన్ని కాంగ్రెస్ రహస్యంగా పొరుగుదేశానికి అమ్మేసినట్టు ఉందని ఆరోపించారు.

సీఎం కుటుంబ సభ్యులు కంపెనీలతో చేసుకున్న భూ ఒప్పందాలను బయటపెట్టాలని అడిగినా సీఎం నోరు మెదపడం లేదని అస్సాం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఎక్స్ చేశారు. సీఎం భార్య కంపెనీకి కేంద్ర ప్రభుత్వ పథకం కింద రూ.10 కోట్ల సబ్సిడీ ఇచ్చారని ఆరోపించారు. ఈ ప్రశ్నలకు స్పందించడానికి సీఎం హిమంత భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

 కాంగ్రెస్ షేర్ చేసిన యానిమేటెడ్ వీడియోలో భారత చిత్రపటంలో ఈశాన్య ప్రాంతం లేదు. రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ మధ్య సంభాషణ ఉంది. మోదీ మాట్లాడుతూ.. తన వద్ద ఈడీ, పోలీసులు, ప్రభుత్వం, డబ్బు, స్నేహితులు ఉన్నారని చెబుతూ మీ దగ్గర ఏముందని ప్రశ్నిస్తారు. దానికి రాహుల్ బదులిస్తూ.. నా వెనక దేశం మొత్తం ఉంది.. (మేరే పాస్ మా హై) అని చెబుతారు. 

ఈ వీడియో స్క్రీన్‌షాట్లను పంచుకున్న సీఎం శర్మ.. కాంగ్రెస్ షేర్ చేసిన ఇండియా మ్యాప్‌పై ఈశాన్య ప్రాంతం లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ.. రాహుల్ విదేశాలకు వెళ్లింది ఇందుకేనా? అని ప్రశ్నించారు. స్టూడెంట్ యాక్టివిస్ట్ షర్జీల్ ఇమామ్‌కు పార్టీ సభ్యత్వం ఇచ్చిందా? అని ప్రశ్నించారు. చూస్తుంటే  ఈశాన్య ప్రాంతం మొత్తాన్ని కాంగ్రెస్ పొరుగుదేశానికి అమ్మేసినట్టు ఉందని ఆరోపించారు.   

Himanta Sarma
Assam
Congress
BJP
Rahul Gandhi

More Telugu News