Ram Mohan Naidu Kinjarapu: చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నా టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతల పార్టీ సమావేశం నిర్వహించాం: రామ్మోహన్‌నాయుడు
- నిబద్ధత చాటుకున్నామన్న టీడీపీ ఎంపీ
- వైసీపీ నిర్వహించలేదని విమర్శలు
- రాష్ట్రంలో చీకటి రోజులు కొనసాగుతున్నాయని ఆగ్రహం
- రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు
ఆంధ్రప్రదేశ్‌లో చీకటి రోజులు కొనసాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టును ఖండించిన ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అధినేత రిమాండ్‌లో ఉన్నా పార్టీ నిబద్ధతకు కట్టుబడి టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. వైసీపీ నేతలు మాత్రం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించలేదని విమర్శించారు.
కాగా, చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నంద్యాలలో టీడీపీ నేతలు చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. ఆయన త్వరగా విడుదల కావాలంటూ పట్టణంలోని 21వ వార్డులోని సెయింట్ పీటర్స్ చర్చిలో నిర్వహించిన ప్రార్థనల్లో టీడీపీ నంద్యాల ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులో టీడీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విశాఖపట్టణం జిల్లాలో అగనంపూడి నుంచి సింహాచలం దేవస్థానం వరకు పాదయాత్ర నిర్వహించారు. అలాగే, విజయనగరం, గజపతినగరంలోనూ నిరసనలు కొనసాగాయి. టీడీపీ నేతలు గజపతినగరం నుంచి విజయనగరం పైడితల్లి అమ్మవారి గుడి వరకు పాదయాత్ర నిర్వహించారు. అయితే, పాదయాత్రకు అనుమతిలేదంటూ టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.