Neeraj Chopra: కొద్దిలో స్వర్ణం చేజార్చుకున్న భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా
- ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ ఫైనల్లో రెండో స్థానం
- బంగారు పతకం నిలబెట్టుకోలేకపోయిన చోప్రా
- ఆసియా క్రీడల్లో బరిలోకి దిగనున్న నీరజ్
ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ ఫైనల్లో భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా నిరాశ పరిచాడు. జావెలిన్ త్రో ఈవెంట్ లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన నీరజ్ స్వర్ణాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. నిన్న అర్ధరాత్రి జరిగిన ఫైనల్స్ లో కొద్దిలో బంగారు పతకం చేజార్చుకున్నాడు. ఆరుగురు బరిలో నిలిచిన ఫైనల్లో తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 83.80 మీటర్ల దూరం విసిరి రెండో స్థానం సాధించాడు.
చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెచ్ అత్యధికంగా 84.24 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. ఫిన్లాండ్‌కు చెందిన ఒలీవర్ హెలాండర్ 83.74 మీటర్లతో కాంస్యం సాధించాడు. కాగా, నీరజ్ చోప్రా ఈ నెల 23 నుంచి చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో బరిలోకి దిగనున్నాడు.