Daggubati Purandeswari: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తాం: పురందేశ్వరి
- టీడీపీతో కలిసి పోటీ చేస్తామని, బీజేపీ కూడా కలిసి వస్తుందని భావిస్తున్నానన్న పవన్
- పవన్ అభిప్రాయాన్ని అధిష్ఠానానికి వివరిస్తామన్న పురందేశ్వరి
- చంద్రబాబు అరెస్ట్ ను అందరికంటే ముందు బీజేపీనే ఖండించిందని వ్యాఖ్య
వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందనే భావిస్తున్నానని ఆయన చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును ములాఖత్ ద్వారా కలిసిన అనంతరం, జైలు వెలుపల మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై ఈ ప్రకటన చేశారు. పవన్ వ్యాఖ్యలపై పురందేశ్వరి స్పందించారు. పవన్ వ్యాఖ్యలను తాము తప్పుగా చూడబోమని... ఆయన వ్యాఖ్యలను హైకమాండ్ కు వివరిస్తామని చెప్పారు. జనసేనతో బీజేపీ పొత్తులోనే ఉందని తెలిపారు. ఏపీలో పొత్తులపై హైకమాండ్ తమతో చర్చలు జరిపే సమయంలో తమ అభిప్రాయాలను వారికి వివరిస్తామని చెప్పారు. ఢిల్లీకి వెళ్లి తన అభిప్రాయాలను చెపుతానని పవన్ కల్యాణ్ కూడా అన్నారని తెలిపారు.
చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన వెంటనే బీజేపీ స్పందించిందని... చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నామని తామే ముందుగా ప్రకటన చేశామని అన్నారు. బాబు అరెస్ట్ ను ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు ఖండించారని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ విధానాన్ని తాము తప్పుపట్టామని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందనే ప్రచారంలో నిజం లేదని అన్నారు. సీఐడీ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని, కేసు వెనుక రాష్ట్ర ప్రభుత్వమే ఉంటుందని చెప్పారు.