Team India: ప్రపంచకప్ లో భారత్ కు మెరుగైన అవకాశాలు: శ్రీలంక కెప్టెన్
- సొంత మైదానాలపై భారత ఆటగాళ్లకు బాగా కలిసొస్తుందన్న అభిప్రాయం
- అదే సమయంలో అన్ని జట్లకు మెరుగైన అవకాశాలున్నాయన్న దాసున్ షణక
- తమ జట్టును ఒంటిచేత్తో గెలిపించే ఆటగాళ్లు ఉన్నట్టు ప్రకటన
ఆసియాకప్ లో భాగంగా భారత్, శ్రీలంక నేడు అమీ తుమీ తేల్చుకోనున్నాయి. గ్రూప్4లో శ్రీలంకపై భారత్ మంచి విజయాన్నే నమోదు చేసింది. కాకపోతే అది సునాయాస విజయం అయితే కాదు. సొంత మైదానంలో శ్రీలంక బలంగానే కనిపిస్తోంది. అదే సమయంలో భారత జట్టు కూడా మంచి ఫామ్ లోనే ఉంది. దీంతో ఫైనల్ మ్యాచ్ పట్ల ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా శ్రీలంక కెప్టెన్ దాసున్ షణక స్పందిస్తూ.. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచకప్ లో భారత్ కు మెరుగైన అవకాశాలున్నాయని చెప్పాడు.
అదే సమయంలో అన్ని జట్లకూ మంచి అవకాశాలున్నట్టు షణక చెప్పాడు. ‘‘అనుకూలత, ప్రతికూలత అని నేను అనుకోను. ఒక్కసారి భారత్ కు చేరుకున్న తర్వాత అక్కడి పిచ్ లు బ్యాటింగ్ కు ఎంత అనుకూలమో తెలుసు. కనుక అన్ని జట్లకు మంచి విజయావకాశాలు ఉన్నాయి. భారత్ కు పిచ్ కండీషన్స్ బాగా తెలుసు కనుక వారికి కాస్త మెరుగైన అవకాశాలు అయితే ఉంటాయి. వారికి మంచి సామర్థ్యాలు కూడా ఉన్నాయి’’అని దాసున్ షణక పేర్కొన్నాడు.
తమ జట్టులో ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించగల స్టార్స్ ఉన్నట్టు శ్రీలంక కెప్టెన్ తెలిపాడు. తమ బ్యాటింగ్ లైనప్ మంచిగా ఉందని, నాణ్యమైన స్పిన్నర్లు తమవైపు ఉన్నట్టు చెప్పాడు. ప్రపంచకప్ పై మాట్లాడుతూ.. పిచ్ లు, బౌలింగ్ సవాలుగా పేర్కొన్నాడు. చాలా చక్కగా ఆడాల్సి ఉంటుందన్నాడు. ఐపీఎల్ లో వానిందు హసరంగ, మతీష్ పతిరణ తదితర శ్రీలంక ఆటగాళ్లు ఆడిన అనుభవం కలిసొస్తుందా? అన్న ప్రశ్నకు.. అవునంటూ, అదే సమయంలో ఐపీఎల్ లో లంక నుంచి ఎక్కువ మంది పాల్గొనడం లేదన్న విషయాన్ని ప్రస్తావించాడు. ఐపీఎల్ ఆడే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు తమకున్నారంటూ, భవిష్యత్ లో అందుకోసం చూస్తున్నట్టు చెప్పాడు.