Chandrababu: లోక్ సభలో గల్లా జయదేవ్, మిథున్ రెడ్డి మధ్య మాటల యుద్ధం
- పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం
- చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని లోక్ సభలో ప్రస్తావించిన గల్లా జయదేవ్
- చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని వెల్లడి
- రాజకీయ కక్షలు ఆపేందుకు ప్రధాని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
- గల్లా జయదేవ్ ఆరోపణలు ఖండించిన మిథున్ రెడ్డి
- అన్ని ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేశారని స్పష్టీకరణ
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అంశంపై లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. గల్లా జయదేవ్ ప్రసంగిస్తూ, తమ నేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని వెల్లడించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజు ఏపీ చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిపోయిందని అన్నారు.
చంద్రబాబు అనేక సంస్కరణలతో ప్రగతి సారథిగా నిలిచారని కొనియాడారు. ఐటీని విశేషంగా ప్రోత్సహించడం ద్వారా చంద్రబాబు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని తెలిపారు. కాగా, చంద్రబాబు అరెస్ట్ కోసం చట్టాలను తుంగలో తొక్కిన తీరును ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువస్తున్నానని గల్లా జయదేవ్ వివరించారు.
చంద్రబాబును ఇబ్బందిపెట్టేందుకు చవకబారు ఎత్తుగడలు వేశారని విమర్శించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు డబ్బు అందినట్టు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని పేర్కొన్నారు. ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఆపేలా ప్రధాని చర్యలు తీసుకోవాలని, చంద్రబాబును వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని గల్లా జయదేవ్ విజ్ఞప్తి చేశారు.
అయితే, గల్లా జయదేవ్ ఆరోపణలను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఖండించారు. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో కుంభకోణం జరిగిందని స్పష్టం చేశారు. అన్ని ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని, టీడీపీ అధినేత అరెస్టులో ఎలాంటి కక్ష సాధింపు లేదని వెల్లడించారు. గల్లా జయదేవ్ ఆరోపణలపై మరింత వివరణ ఇస్తానని మిథున్ రెడ్డి తెలిపారు.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నకిలీ జీవోల సాయంతో రూ.371 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈ కేసులో నగదు ఎక్కడికి వెళ్లిందో ఈడీ స్పష్టం చేసిందని, ఇంకేం ఆధారాలు కావాలని అన్నారు. పైగా, చంద్రబాబు పీఏ దేశం విడిచి పారిపోయారని మిథున్ రెడ్డి తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని ఉద్ఘాటించారు.