CM Jagan: తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
- తిరుపతి, తిరుమల పర్యటనకు విచ్చేసిన సీఎం జగన్
- తిరుపతిలో శ్రీనివాససేతు ఫ్లైఓవర్ ప్రారంభం
- తిరుమలలో సీఎం జగన్ కు ఘనస్వాగతం
- నేటి నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఏపీ సీఎం జగన్ ఇవాళ తిరుపతి, తిరుమల పర్యటనకు విచ్చేశారు. తిరుపతిలో పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆయన, ఆ తర్వాత తిరుమల చేరుకున్నారు. తిరుమలలో సీఎం జగన్ కు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
ఇవాళ సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారికి సీఎం జగన్ ఏపీ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారి దర్శనం అనంతరం సీఎం జగన్ కు ఆలయ అర్చకుడు వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి ఆలయ సన్నిధిలోని రంగరాయలు మండపంలో 2024 టీటీడీ క్యాలెండర్ ను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఇవాళ బ్రహ్మోత్సవాల్లో పెద్ద శేష వాహన సేవ నిర్వహించనున్నారు. ఈ సేవలో సీఎం జగన్ కూడా పాల్గొంటారు.
కాగా, ఈ పర్యటనలో సీఎం జగన్ వెంట మంత్రులు కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, పెద్దిరెడ్డి, రోజా, ఆదిమూలపు సురేశ్, మాజీ మంత్రి కొడాలి నాని తదితరులు ఉన్నారు. తిరుమల పర్యటన సందర్భంగా సీఎం జగన్ రచన, వకుళమాత అతిథి గృహాలను కూడా ప్రారంభించారు.
అంతకుముందు తిరుపతిలో సీఎం జగన్ శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ హాస్టళ్లను కూడా ప్రారంభించారు.