Vijayasai Reddy: చంద్రబాబు అరెస్ట్‌పై రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు
- చంద్రబాబును కింగ్ ఆఫ్ కరప్షన్‌గా అభివర్ణించిన వైసీపీ ఎంపీ
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సాక్ష్యాలతోనే అరెస్ట్ చేసినట్లు స్పష్టీకరణ
- చంద్రబాబు వెన్నుపోటుదారుడని రాజ్యసభలో విమర్శలు
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రారంభ చర్చ సందర్భంగా రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఇబ్బందుల గురించి ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ బిల్లుల అవసరాన్ని సభలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ విభజన, అవినీతి అంటూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో భారత్ ఎప్పటికీ అభివృద్ధి చెందుతోన్న దేశంగానే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు.
అదే సమయంలో, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఆ పార్టీ నిరాధార ఆరోపణలు చేస్తోందని సభలో ప్రస్తావించారు. చంద్రబాబును కింగ్ ఆఫ్ కరప్షన్‌గా అభివర్ణించారు. తనపై తొమ్మిది కేసులు ఉన్నట్లు స్వయంగా టీడీపీ అధినేతనే అఫిడవిట్ ఇచ్చారన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయన చేసిన అవినీతికి సాక్ష్యాలు ఉన్నాయని, సాక్ష్యాలు సేకరించాకే చంద్రబాబును అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపించారన్నారు. చంద్రబాబు ఓ వెన్నుపోటుదారుడన్నారు. నాటి నుంచి బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఆయన ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారని, ఆయన భవిష్యత్తు కోర్టు నిర్ణయిస్తుందన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని నిండా ముంచారన్నారు.