Agra: మహిళపై వేధింపులు.. ఎస్సైని స్తంభానికి కట్టేసి కొట్టిన గ్రామస్థులు!
- ఆగ్రాలో వెలుగు చూసిన ఘటన
- మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండగా వేధింపులకు దిగాడంటూ గ్రామస్థుల ఆరోపణ
- అతడి దుస్తులు తొలగించి, స్తంభానికి కట్టేసి కొట్టిన వైనం
- ఘటన విషయం తెలియగానే ఎస్సైని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
- నిజానిజాలు తేల్చేందుకు దర్యాప్తు ప్రారంభం
ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండగా లోపలికి ప్రవేశించి ఆమెను వేధించేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ గ్రామస్థులు ఓ ఎస్సైని పట్టుకుని చితకబాదారు. అతడి దుస్తులు తొలగించి, స్తంభానికి కట్టేసి కొట్టారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు ఈ ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వ్యవహారం వైరల్గా మారింది. విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఎస్సై సందీప్ కుమార్ను తక్షణం సస్పెండ్ చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు, తనపై అత్యాచారానికి యత్నించాడంటూ మహిళ ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదైంది.
ఎస్సై అకృత్యాన్ని నిరసిస్తూ గ్రామస్థులు సోమవారం పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సందీప్ కుమార్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. దర్యాప్తు కోసం వెళ్లిన తనపై గ్రామస్థులే దాడి చేశారని ఆరోపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సందీప్ రెండు సంవత్సరాల క్రితం పోలీసు శాఖలో జాయిన్ అయ్యారు.