Chandrababu: ఆ తర్వాతే చంద్రబాబు అరెస్ట్: క్వాష్ పిటిషన్‌పై సీఐడీ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు

CID side arguments in Chandrababu quash petition in AP HC
  • చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు అనర్హుడని ముకుల్ రోహత్గీ వాదనలు
  • కేసు నమోదయ్యాక రెండేళ్లపాటు సాక్ష్యాలు సేకరించాకే అరెస్ట్ చేశామని వెల్లడి
  • బోగస్ కంపెనీల ద్వారా రూ.371 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని వ్యాఖ్య
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంగళవారం వాదనలు కొనసాగుతున్నాయి. తొలుత చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూద్రాలు వాదనలు వినిపించారు. ఆ తర్వాత సీఐడీ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వర్చువల్‌గా తన వాదనలు వినిపించారు. రోహత్గీ తన వాదనలు వినిపిస్తూ... చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు అనర్హుడన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయలేదని, కేసు నమోదైన తర్వాత రెండేళ్లపాటు సాక్ష్యాధారాలు సేకరించాకే అరెస్ట్ చేశారన్నారు. ఈ కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు.

సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లు అయినా వేయవచ్చునని, ఎంతమంది సాక్షులనైనా కేసులో చేర్చవచ్చునన్నారు. అన్ని కోట్లు ఎక్కడకు వెళ్లాయో నిగ్గు తేల్చాల్సి ఉందన్నారు. ఈ కేసుకు సంబంధించి షెల్ కంపెనీల జాడ తీస్తున్నామన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎంవోయూ నుంచి సబ్ కాంట్రాక్ట్ ఎలా వెళ్లిందో తెలియాలన్నారు. అన్ని బోగస్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేశారన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగిందని కోర్టుకు తెలిపారు. ఈ డీల్‌కు అసలు కేబినెట్ ఆమోదమే లేదన్నారు. టీడీపీ అధినేత పథకం ప్రకారమే తన అనుచరులతో కలిసి బోగస్ కంపెనీల పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు.
Chandrababu
cid
AP High Court
harish salve

More Telugu News