yanamala: జగన్ పాలనలో దేవుడిని దర్శించుకునే స్వేచ్ఛ కూడా లేదు: యనమల
- దేవాలయాలు, మసీదులు, చర్చిలకు వెళ్లే టీడీపీ నేతలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం
- ప్రార్థించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం మత విశ్వాసాలను అవమానించడమేనని వ్యాఖ్య
- టీడీపీ నేతల గృహ నిర్బంధం దుర్మార్గమని ఆవేదన
జగన్ పాలనలో దేవుడిని కూడా దర్శించుకునే స్వేచ్ఛ లేకుండా పోయిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని, ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య అన్నారు. టీడీపీ నేతల గృహ నిర్బంధం దుర్మార్గమన్నారు.
తమ పార్టీ అధినేత జైలు నుంచి బయటకు రావాలని దేవాలయాలు, మసీదులు, చర్చిలలో ప్రార్థించేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను అడ్డుకున్నారన్నారు. ఇది మత విశ్వాసాలను అవమానించడమే అన్నారు. జగన్ పాలనలో దేవుడిని దర్శించుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందన్నారు. విజయవాడ, గుంటూరు, ఉభయగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేయడం దుర్మార్గమన్నారు.