Hyderabad Drugs Case: డ్రగ్స్ కేసు.. సినీ ప్రముఖుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Madhapur Drugs Case Tollywood Celebrities Names In Radar
  • డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన 8 మంది నిందితుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన టీఎస్‌న్యాబ్
  • నిందితుల సెల్‌ఫోన్లలో సినీ పరిశ్రమకు చెందిన పలువురి ఫోన్ నంబర్ల గుర్తింపు
  • బెంగళూరు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చి రేవ్ పార్టీలు
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో  సినీ ప్రముఖుల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు కనిపిస్తోంది. మాదాపూర్‌లో ఇటీవల అరెస్ట్ అయిన బాలాజీ, రాంకిశోర్, కల్హర్‌రెడ్డి సెల్‌ఫోన్ల డేటాను పరిశీలించిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) అధికారులు వాటిలో పలువురు సినీ ప్రముఖుల ఫోన్ నంబర్లను గుర్తించినట్టు తెలుస్తోంది. 

ఈ కేసులో అరెస్ట్ అయిన 8 మంది నిందితుల కస్టడీ కోరుతూ అధికారులు నిన్న కోర్టులో పిటిషన్ వేశారు. భాస్కర్, మురళీ వెంకటరత్నారెడ్డి ఇచ్చిన సమాచారంతో ఈ నెల 14న ముగ్గురు నైజీరియన్లు సహా మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేశ్‌రావు, రాంచందర్, కె.సందీప్, సుశాంత్‌రెడ్డి, శ్రీకర్ కృష్ణప్రసాద్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఏడు రోజుల కస్టడీ కోరుతూ నార్కోటిక్స్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. 

బెంగళూరులోని నైజీరియన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చే నిందితులు రేవ్ పార్టీలు నిర్వహించి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించేవారని అధికారులు తెలిపారు. మత్తు పదార్థాలను ఎరగావేసి మోడళ్లు, సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూసే యువతులను రప్పించేవారని, ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని సినీ నిర్మాతలుగా అవతారం ఎత్తేవారని దర్యాప్తులో వెల్లడైనట్టు వివరించారు.
Hyderabad Drugs Case
TSNAB
Tollywood

More Telugu News