IIT Bombay: ఐఐటీ బాంబే విద్యార్థికి అదిరిపోయే ఆఫర్.. ఏడాదికి రూ. 3.7 కోట్ల వేతనంతో ఉద్యోగం

IIT Bombay Graduate Sets New Record With Rs 3 Crore 70 lakh Annual Salary

  • ఇటీవల క్యాంపస్ ప్లేస్ మెంట్ నిర్వహించిన సంస్థ
  • మరో విద్యార్థినికి రూ.1.7 కోట్ల ప్యాకేజీతో జాబ్ ఆఫర్
  • గతేడాది ప్లేస్ మెంట్లలో అత్యధికంగా 2.1 కోట్ల వార్షిక ప్యాకేజీ

క్యాంపస్ ప్లేస్ మెంట్ల విషయంలో ఐఐటీ బాంబే మరోసారి రికార్డు సృష్టించింది. ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్ మెంట్ లో ఓ విద్యార్థి ఏకంగా రూ.3.7 కోట్ల వార్షిక వేతనంతో జాబ్ ఆఫర్ దక్కించుకున్నారు. ఓ మల్టీ నేషనల్ కంపెనీ తమ విద్యార్థికి ఈ ఆఫర్ ఇచ్చిందని ఐఐటీ బాంబే ఓ ప్రకటనలో తెలిపింది. 

మరో విద్యార్థిని రూ.1.7 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఆఫర్ అందుకుందని వివరించింది. గతేడాది జరిగిన క్యాంపస్ ప్లేస్ మెంట్ తో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక వేతన ప్యాకేజీలతో తమ విద్యార్థులు జాబ్ ఆఫర్లు అందుకున్నారని వివరించింది. ఈ ఆఫర్లను తమ విద్యార్థులు అంగీకరించారని వెల్లడించింది. అయితే, సదరు విద్యార్థుల పేర్లు కానీ, జాబ్ ఆఫర్ చేసిన సంస్థల వివరాలను కానీ ఐఐటీ బాంబే బయటపెట్టలేదు. 

2022-23 ఏడాదిలో ఇప్పటి వరకు నిర్వహించిన ప్లేస్‌మెంట్లలో 194 మంది విద్యార్ధులు జాబ్స్ దక్కించుకున్నారని ఐఐటీ బాంబే తెలిపింది. ఇందులో వార్షిక వేతనం రూ.1 కోటి కంటే ఎక్కువ ఉన్న ఆఫర్ లు పదహారు అని పేర్కొంది. అమెరికా, జపాన్, యూకే, నెదర్లాండ్స్, హాంగ్ కాంగ్, తైవాన్ లలో 65 మంది ఉద్యోగాలు పొందారని వివరించింది. గతేడాది నిర్వహించిన ప్లేస్ మెంట్ లో రూ.2.1 కోట్ల వార్షిక వేతనమే అత్యధికమని పేర్కొంది. ఈసారి మరింత ఎక్కువ వేతనంతో తమ విద్యార్థులు ఉద్యోగాలు పొందడంపై సంస్థ సంతోషం వ్యక్తం చేసింది. ప్రతీయేటా గణనీయమైన పెరుగుదలతో విద్యార్ధులు ఉద్యోగాలు పొంతున్నారని ఓ ప్రకటనలో వెల్లడించింది.

  • Loading...

More Telugu News