School Bus: స్కూల్ బస్ నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్ మృతి.. అద్దంకిలో ఘటన
- రోడ్డు మధ్యలో నిలిచిపోయిన స్కూల్ బస్
- డ్రైవర్ ను కిందికి దించిన స్థానికులు
- అప్పటికే చనిపోయిన డ్రైవర్.. పిల్లలకు తప్పిన ముప్పు
ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఓ స్కూల్ బస్సుకు ప్రమాదం తప్పింది. బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు రావడంతో స్టీరింగ్ పైనే కుప్పకూలాడు. ప్రాణం పోయే ముందు బ్రేక్ వేసి బస్సును రోడ్డుపైనే ఆపాడు. గుండెపోటుతో డ్రైవర్ చనిపోయాడు.. అయితే, బస్సులోని పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
అద్దంకి లోని ఓ ప్రైవేటు స్కూలులో చుట్టుపక్కల ఊళ్ల నుంచి విద్యార్థులు చదువుకుంటున్నారు. వారి కోసం స్కూల్ యాజమాన్యం ఓ బస్సును నడుపుతోంది. ఆ బస్సుకు ఏడుకొండలు (55) డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగానే బుధవారం ఉదయం కూడా వెంపరాల రూట్ లోని గ్రామాలలో విద్యార్థులను ఎక్కించుకొని పాఠశాలకు తీసుకొస్తున్నాడు. వెంపరాల సమీపంలోకి చేరుకోగానే డ్రైవర్ ఏడుకొండలు బస్సును రోడ్డుపైనే బస్సును ఆపేశాడు.
గుండెల్లో నొప్పిగా ఉందంటూ నీళ్లు తాగి ఆపై స్టీరింగ్ పైనే తలవాల్చాడు. బ్రేక్ వేసి బస్సును నిలపడంతో పిల్లలకు ముప్పు తప్పింది. బస్సు రోడ్డుపైనే ఆగడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూడగా.. ఏడుకొండలు స్టీరింగ్ పై తలవాల్చి కనిపించాడు. వెంటనే అతనిని కిందికి దించి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన చనిపోయాడని వైద్యులు తెలిపారు. కాగా, విద్యార్థులను అదే బస్సులో మరో డ్రైవర్ తో స్కూలుకు చేర్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.