Adiseshagiri Rao: నారా భువనేశ్వరిని పరామర్శించిన నిర్మాత ఆదిశేషగిరిరావు.. జగన్ పై విమర్శలు
- రాజమండ్రిలో భువనేశ్వరిని కలిసిన ఆదిశేషగిరిరావు
- చంద్రబాబు, వైఎస్ మధ్య కక్ష సాధింపు రాజకీయాలు లేవని వ్యాఖ్య
- జగన్ పాలనలోనే ఇలాంటివి చూస్తున్నానని విమర్శ
టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అడుగుపెట్టి 10 రోజులైంది. మరోవైపు ఆయన జైలుకు వెళ్లినప్పటి నుంచి ఆయన భార్య భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు జైలుకు కిలో మీటర్ దూరంలోని క్యాంపులో బస చేస్తున్నారు. భువనేశ్వరి అక్కడే ఉండి తన భర్తకు కావాల్సి ఆహారాన్ని జైలుకు పంపిస్తున్నారు.
మరోవైపు భువనేశ్వరి, కుటుంబ సభ్యులను సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కలిసి, వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, రాజశేఖరరెడ్డి ఇద్దరినీ ముఖ్యమంత్రులుగా చూశానని, వారి మధ్య ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు లేవని చెప్పారు. జగన్ పాలనలోనే ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చూస్తున్నానని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేయడం దారుణమని చెప్పారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి, సమాజానికి మంచిది కాదని అన్నారు.