YS Sharmila: తన సీటు పోయినా బాధపడనన్న కేటీఆర్ కు షర్మిల సవాల్
- బీఆర్ఎస్ సీట్లలో మహిళలకు 33 శాతం ఇవ్వాలని షర్మిల డిమాండ్
- మహిళలపై మీకు ప్రేమ లేదని విమర్శ
- సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేట స్థానాలను త్యాగం చేయాలని డిమాండ్
మహిళా రిజర్వేషన్లలో భాగంగా తన సీటు పోయినా బాధపడనన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సెటైర్లు వేశారు. మహిళా రిజర్వేషన్లతో తన సీటు కోల్పోయినా సిద్ధమే అని చెప్పే కేటీఆర్ గారూ.. బిల్లు అమలయ్యేదాక ఎదురుచూడటం ఎందుకు? ఈ ఎన్నికల్లోనే మీ సీటు త్యాగం చేసి ఒక మహిళకు ఇవ్వండని షర్మిల ఎద్దేవా చేశారు. మీ సీటును త్యాగం చేస్తే మిమ్మల్ని అడ్డుకునేదెవరని ప్రశ్నించారు.
నిజంగా మహిళల రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే.. మీరు డబ్బాలు కొట్టుకుంటున్నట్టు మహిళా బిల్లు మీ పోరాట ఫలితమే అయితే.. ఈ ఎన్నికల్లోనే మహిళలకు పెద్దపీట వేయండి, మీ సీటు మహిళకు ఇవ్వండని అన్నారు. మీ పార్టీ ప్రకటించిన సీట్లలో మహిళలకు 33 శాతం తక్షణమే అమలు చేసి చూపించాలని డిమాండ్ చేశారు. బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు సమాన అవకాశాలు కల్పించిన రాష్ట్రంగా తెలంగాణను ఆదర్శంగా నిలపాలని అన్నారు.
రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో 63 స్థానాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని ఎన్నికల సంఘం చెప్తోందని... 33 శాతం రిజర్వేషన్ లెక్కన ఈ ఎన్నికల్లో మీరిచ్చిన 7 సీట్లతో పాటు మరో 32 సీట్లు ఇవ్వాలని అన్నారు. గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లలో మహిళల ఓట్లే అధికం కాబట్టి దమ్ముంటే మీ సీట్లను ఇప్పుడే త్యాగం చేయాలని... అప్పుడు నమ్ముతాం మహిళా బిల్లు మీ పోరాట ఫలితమేనని అని అన్నారు. దమ్ముంటే కేటీఆర్ ఈ సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు.