Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
- 8వ రోజూ కొనసాగిన నిరసన కార్యక్రమాలు
- పలు నియోజకవర్గాల్లో రిలే నిరహార దీక్షలు, అర్ధనగ్న ప్రదర్శనలు చేపట్టిన టీడీపీ శ్రేణులు
- చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అరెస్ట్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో 8వ రోజూ టీడీపీ నేతల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. తెలుగు రైతు, బీసీ విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. జగన్ రెడ్డి అవినీతిని ఎండగట్టడంతో పాటు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఈ సందర్భంగా నేతలు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడికి వస్తున్న ప్రజాదరణ చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంబేలెత్తిపోతున్నారని, అందుకే కుట్రపూరితంగా ఆయనను అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. ఆధారాలు లేకుండా అక్రమ అరెస్ట్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు.
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో వేలాది మంది మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో దళిత నాయకులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో నందమూరి రామకృష్ణ పాల్గొని సంఘీభావం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలని నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి వేషధారణలో వున్న వ్యక్తికి చీర కట్టి, పూలు పెట్టి, గాజులు తొడిగి మహిళలు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడిని చూసి భయపడుతున్న జగన్ లేనిపోని ఆరోపణలు చేసి అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.
నెల్లూరు రూరల్‌లో చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అర్థనగ్న ప్రదర్శన చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. విశాఖ ఆర్కే బీచ్‌లో టీడీపీ నేత గండి బాబ్జి జలదీక్షకు దిగారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సముద్రంలో నిలబడి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమాలలో పోలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనందనాబు, గోరంట్ల బుచ్చియ్య చౌదరి, ఎండీ షరిఫ్, బొండా ఉమామహేశ్వరరావు, రెడ్డెప్ప గారి శ్రీనివాసులురెడ్డి, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు కూన రవికుమార్, పల్లా శ్రీనివాసరావు, రెడ్డి అనంతకుమారి, కె.ఎస్ జవహార్, గన్ని వీరాంజనేయులు, జీవి ఆంజనేయులు, ఏలూరి సాంబశివరావు, మల్లెల లింగారెడ్డి, గొల్లా నరసింహాయాదవ్, పులివర్తి నాని, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, రాష్ట్ర, మండల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.