Hyderabad: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల ప్రారంభం

Elecrict buses in Hyderabad IT corridor

  • 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసుల్లో భాగంగా 25 బస్సులు ప్రారంభం
  • సెప్టెంబర్ 23 నుంచి అందుబాటులోకి ఈ బస్సులు
  • సజ్జనార్‌పై మంత్రి పువ్వాడ అజయ్ ప్రశంసలు

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను ప్రారంభించారు. గచ్చిబౌలి స్టేడియంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. మొత్తం 50 గ్రీన్ మెట్రో ల‌గ్జ‌రీ ఏసీ స‌ర్వీసుల్లో మొద‌టి విడ‌త‌లో 25 బ‌స్సులను లాంఛ‌నంగా ప్రారంభించారు. ఇవి సెప్టెంబర్ 23 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అంత‌కుముందు వారు ఈ బ‌స్సుల ప్ర‌త్యేక‌త‌ల‌ను ప‌రిశీలించారు. 

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ... టీఎస్‌ఆర్టీసీ క‌ష్టాల్లో ఉన్నా ప్ర‌జ‌లకు రవాణా కష్టాలు రాకుండా మెరుగైన, నాణ్యమైన సేవ‌లను అందిస్తూనే ఉంద‌న్నారు. హైదరాబాద్‌ నగరంలో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను మరింతగా పెంచేలా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ప్రైవేట్‌‌కు దీటుగా టీఎస్‌ఆర్టీసీ పనిచేస్తోందన్నారు. టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించాక గత రెండేళ్ల కాలంలోనే ఎన్నో మార్పులు తీసుకొచ్చార‌ని కొనియాడారు. న‌గ‌రం న‌లుదిక్కుల విస్త‌రించి ఉండ‌టంతో మెట్రోకు అనుసంధానంగా ర‌వాణా సేవ‌లు మెరుగుపడుతున్నాయని, త్వరలోనే ఒక్క కార్డుతో అన్ని రకాల ప్రయాణాలు చేయొచ్చునని చెప్పారు.

భవిష్యత్తు తరాలకు వాయు కాలుష్యం లేని వాతావ‌ర‌ణాన్ని అందించాలంటే ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించాల్సిన అవసరముందన్నారు. టీఎస్‌ఆర్టీసీ పరిరక్షించుకోవడానికి సంస్థ ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌డం మంచి ప‌రిణామ‌మని, ఇది త‌న హ‌యాంలో జ‌రగ‌డం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌‌కు ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులకు మంచి డిమాండ్ ఉందని, ఎయిర్ పోర్ట్ మార్గంలో తిరిగే బస్సుల్లో 80 శాతం ఆక్యూపెన్సీ రేషియో ఉందన్నారు. ప్రతిరోజు దాదాపు 6 వేల మంది ఏసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, ఈ స్పూర్తితోనే మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుందన్నారు. హైదరాబాద్ కు తలమానికమైన ఐటీ కారిడార్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 500 బస్సులను నడుపుతుండగా రానున్న నాలుగు నెలల్లో 475 ఎలక్ట్రిక్ బస్సులను ఐటీకారిడార్‌లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. మొత్తంగా ఈ ఆర్థిక ఏడాదిలో కొత్తగా 1860 ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తీసుకురావాలని సంస్థ ప్లాన్ చేసిందన్నారు. ఈ కొత్త బస్సులను అత్యాధునిక హంగులతో రూపొందించామని చెప్పారు.

  • Loading...

More Telugu News