Balakrishna: బాలకృష్ణకు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చిన అసెంబ్లీ స్పీకర్.. కోటంరెడ్డి, అనగాని సస్పెన్షన్

Warning to Balakrishna and Kotamreddy and Anagani suspended from Assembly
  • అసెంబ్లీలో మీసం మెలేయడం వంటి పనులు బాలయ్య చేశారన్న స్పీకర్
  • ఇంకోసారి ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరించిన స్పీకర్
  • బాటిల్ పగులగొట్టారంటూ కోటంరెడ్డి, అనగానిలపై సస్పెన్షన్ వేటు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అట్టుడుకుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానాన్ని పట్టుబడుతూ ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ ఛైర్ వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి అంబటి రాంబాబుపై మీసం మెలివేస్తూ, దమ్ముంటే రా అని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభమైన తర్వాత బాలకృష్ణకు స్పీకర్ హెచ్చరిక జారీ చేశారు. సభలో మీసాలు మెలివేయడం, తొడగొట్టడం వంటి రెచ్చగొట్టే పనులను బాలకృష్ణ చేశారని... ఇంకోసారి ఇలాంటి పనులు చేయవద్దని ఆయనకు తొలి హెచ్చరిక జారీ చేస్తున్నామని చెప్పారు. మరోసారి ఇలాంటి పనులు చేస్తే సభ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. 

మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను ఈ అసెంబ్లీ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సభా స్థానంలో ఉన్న ఫైళ్లను చించేశారని, బాటిల్ ను పగలగొట్టారని, మైక్ లాగేశారని, వైర్లు తెంచేశారని... వీరి ప్రవర్తనను గర్హిస్తూ వీరిద్దరిని ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నానని తెలిపారు. వీరి మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఎథిక్స్ కమిటీని కోరుతున్నానని చెప్పారు. ఇలాంటి సభ్యుల ప్రవర్తనను మనం ఖండించలేకపోతే... సభా మర్యాదను కాపాడలేమని అన్నారు.
Balakrishna
Kotamreddy Sridhar Reddy
Anagani
AP Assembly Session
Suspension

More Telugu News