Australia: ఇద్దరు కీలక ఆటగాళ్లు లేకుండానే టీమిండియాతో తొలి వన్డేకు సిద్ధమవుతున్న ఆసీస్

Aussies set to play Team India without Starc and Maxwell
  • వచ్చే నెలలో భారత్ లో ఐసీసీ వరల్డ్ కప్
  • సన్నాహకంగా టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్
  • రేపు మొహాలీలో తొలి వన్డే
  • స్టార్క్, మ్యాక్స్ వెల్ లకు విశ్రాంతి 
  • తాను సిరీస్ మొత్తం ఆడతానని కెప్టెన్ కమ్మిన్స్ ప్రకటన
ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియా జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే, వచ్చే నెలలో భారత్ లోనే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో, ఆసీస్ తమ కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తోంది. 

రేపు మొహాలీలో జరిగే తొలి వన్డేకు ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్, ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ లేకుండానే బరిలో దిగాలని ఆసీస్ టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది. ఈ మేరకు ఆసీస్ సారథి పాట్ కమ్మిన్స్ నిర్ధారించాడు. అయితే, మిగతా రెండు వన్డేల్లో స్టార్క్, మ్యాక్స్ వెల్ ఆడే అవకాశాలున్నట్టు తెలిపాడు.

ఇటీవల యాషెస్ సిరీస్ సందర్భంగా లెఫ్టార్మ్ పేసర్ స్టార్క్ భుజం, గజ్జల్లో గాయాలకు గురయ్యాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లోనూ స్టార్క్ పాల్గొనలేదు. మ్యాక్స్ వెల్ కూడా దక్షిణాఫ్రికాతో సిరీస్ నేపథ్యంలో కాలి మడమ గాయానికి గురయ్యాడు. అంతేకాదు, మ్యాక్స్ వెల్ తన భార్య తొలి ప్రసవం నేపథ్యంలో దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు.

దీనిపై కెప్టెన్ కమ్మిన్స్ మాట్లాడుతూ, ప్రస్తుతం స్టార్క్, మ్యాక్స్ వెల్ జట్టుతోనే ఉన్నారని, కానీ రేపటి వన్డేలో వారు ఆడడంలేదని వెల్లడించాడు. వీరిద్దరూ ప్రాక్టీసులో పాల్గొంటారని వివరించాడు. ఇక, తన ఫిట్ నెస్ గురించి చెబుతూ, మణికట్టు నొప్పి తగ్గిందని, తాను టీమిండియాతో మూడు వన్డేల్లోనూ ఆడతానని కమ్మిన్స్ తెలిపాడు. 

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెప్టెంబరు 22, 24, 27 తేదీల్లో వన్డే సిరీస్ జరగనుంది.
Australia
Mitchell Starc
Glen Maxwell
1st ODI
Team India
Mohali

More Telugu News