Kinjarapu Ram Mohan Naidu: లోక్‌సభలో ఇస్రో మాజీ సైంటిస్ట్ నిర్బంధంతో చంద్రబాబు అరెస్ట్‌ను పోల్చిన రామ్మోహన్ నాయుడు
- నంబి నారాయణ్‌ను తప్పుడు కేసులతో నిర్బంధించినట్లుగా చంద్రబాబును అరెస్ట్ చేశారని వ్యాఖ్య
- ఎంతోమంది యువకులకు చంద్రబాబు స్ఫూర్తినిచ్చారన్న టీడీపీ ఎంపీ
- వేల కోట్ల రూపాయలు దోచుకున్న వారి కోసం సంబరాలు చేసుకుంటున్నారని విమర్శ
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌ను ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్ సభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబినారాయణ్ అక్రమ కేసులను ఉటంకించారు. గురువారం లోక్ సభలో ఆయన మాట్లాడుతూ... నంబి నారాయణ్‌ను తప్పుడు కేసులతో ఎలా అయితే నిర్బంధించారో తమ పార్టీ అధినేతను కూడా అలాగే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఎంతోమంది యువనాయకులకు స్ఫూర్తినిచ్చిన చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తప్పుడు కేసులు పెట్టారన్నారు. రూ.43వేల కోట్లను దోచుకున్న నాయకుడు బెయిల్ పై వచ్చి పదేళ్లయినందుకు కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీలో ఉన్న నారా లోకేశ్‌ను హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా, బీఎస్పీ ఎంపీలు కున్వాల్ డానిష్ అలీ, రితేష్ పాండే, మహారాష్ట్ర సీఎం తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే, బీజేడీ ఎంపీ పినాకీ మిశ్రా తదితరులు కలిసి, సంఘీభావం తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవాలివీ అంటూ నారా లోకేశ్ వారికి పుస్తకాల్ని అందించారు.