Garuda Seva: తిరుమలలో రేపటి గరుడ సేవకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశాం: డీఐజీ అమ్మిరెడ్డి
- తిరుమలలో కొనసాగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు
- ఈ నెల 22న రాత్రి 7 గంటలకు గరుడ సేవ
- గరుడ సేవకు లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
- నేడు భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అనంతపురం రేంజి డీఐజీ అమ్మిరెడ్డి
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు గరుడ సేవ జరగనుంది. స్వామివారి ఉత్సవమూర్తిని గరుడ వాహనంపై ఉంచి తిరుమాడ వీధుల్లో ఊరేగించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ విశిష్ట వాహన సేవను కళ్లారా వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. ఈ నేపథ్యంలో, తిరుమలలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను అనంతపురం రేంజి డీఐజీ అమ్మిరెడ్డి నేడు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ కీలక ఘట్టం అని వెల్లడించారు. రేపు (సెప్టెంబరు 22) రాత్రి 7 గంటలకు గరుడ సేవ ప్రారంభమవుతుందని తెలిపారు. గ్యాలరీల నుంచి 2 లక్షల మంది భక్తులు గరుడ సేవను తిలకించవచ్చని వివరించారు. ఈ నేపథ్యంలో, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు డీఐజీ అమ్మిరెడ్డి చెప్పారు. గరుడసేవకు 5 వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నామని వెల్లడించారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగని రీతిలో పోలీసులను మోహరిస్తామని అన్నారు.
గరుడసేవ సందర్భంగా తిరుమలలో 15 వేల వాహనాల పార్కింగ్ కు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అంతకుమించి వాహనాలు వస్తే, వాటికి తిరుపతిలో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.
భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని, దొంగతనాలు జరగకుండా క్రైమ్ పార్టీల నిరంతరం నిఘా ఉంటుందని డీఐజీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ టెక్నాలజీ వినియోగిస్తామని చెప్పారు. భక్తులు కొండపైకి వచ్చేటప్పుడు విలువైన వస్తువులతో రావొద్దని సూచించారు.