Justin Trudeau: భారత్‌తో వివాదం.. కెనడా ప్రధాని మరో సంచలన ప్రకటన
- ఐక్యరాజ్యసమితిలోని కెనడా హైకమిషన్‌లో ప్రధాని జస్టిన్ ట్రూడో పత్రికా సమావేశం
- మునుపటి ఆరోపణలను మరోసారి ప్రస్తావించిన కెనడా ప్రధాని
- ఈ ఆరోపణలను భారత్ సీరియస్‌గా తీసుకోవాలని విజ్ఞప్తి
- తాము చట్టబద్ధ పాలన, అంతర్జాతీయ సంబంధాలకు కట్టుబడి ఉంటామని వ్యాఖ్య
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌ను ఉద్దేశిస్తూ మరో సంచలన ప్రకటన చేశారు. ఖలిస్థానీ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందనేందుకు విశ్వసనీయ కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. చట్టబద్ధమైన అంతర్జాతీయ దౌత్య సంబంధాలకు తాము కట్టుబడి ఉన్నామన్న ఆయన, కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించాలని కోరారు. ఈ మేరకు గురువారం ఐక్యరాజ్యసమితిలోని కెనడా కార్యాలయంలో ఆయన పత్రికా సమావేశం నిర్వహించారు.
‘‘సోమవారం నేను చెప్పినట్టు కెనడా నేలపై కెనడా పౌరుడి హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందనేందుకు విశ్వసనీయ కారణాలు ఉన్నాయి. ఇది అత్యంత కీలకమైన వ్యవహారం. చట్టసభల వేదికగా నేను ఈ అంశాన్ని ప్రస్తావించాను. ఇది ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు. అంతర్జాతీయంగా తన పలుకుబడి, ప్రాధాన్యత పెంచుకుంటున్న దేశం భారత్ అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. భారత్‌తో కెనడా కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అంశంలో పూర్తి పారదర్శకత దిశగా మాతో కలిసి పనిచేయాలని కోరుతున్నాం’’ అని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
తమది చట్టబద్ధ పాలన ఉన్న దేశమని జస్టిన్ ట్రూడో చెప్పుకొచ్చారు. తమ విలువలు పరిరక్షించుకునేందుకు, దేశ పౌరులను కాపాడుకునేందుకు, అంతర్జాతీయంగా చట్టబద్ధ సంబంధాలు నెలకొల్పేందుకు తాము కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇతర దేశాల్లోని పౌరుల హత్యతో మరో దేశానికి ప్రమేయం ఉండటం అస్సలు ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రధాని మోదీతో కూడా తాను చర్చించినట్టు చెప్పుకొచ్చారు.
జీ20 సమావేశాల సందర్భంగా మోదీ, ట్రూడో మధ్య ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా పేర్కొంది. అయితే, ట్రూడో ప్రస్తావించిన ఆరోణలను మోదీ తోసిపుచ్చారని పేర్కొంది.