Telangana: సీఎం కేసీఆర్ రేపో మాపో శుభవార్త చెబుతారు: కేటీఆర్
- పేదలు, రైతుల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీని త్వరలో ప్రకటిస్తారన్న మంత్రి కేటీఆర్
- ఎన్నికల ముంగిట మరిన్ని పథకాలుప్రకటించే ఆలోచనలో సీఎం కేసీఆర్!
- ఆరు గ్యారెంటీ హామీలతో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన కాంగ్రెస్ కు కౌంటర్ ఇవ్వనున్న బీఆర్ఎస్
అసెంబ్లీ ఎన్నికల ముంగిట తెలంగాణ సీఎం కేసీఆర్ మరో పథకాన్ని ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పేదల కోసం మరిన్ని పథకాలు అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఐటీ శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ అన్నారు. పేదలు, రైతుల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీ ఉండబోతున్నదని, త్వరలోనే సీఎం కేసీఆర్ ఆ విషయాలను ప్రకటిస్తారని వెల్లడించారు. ప్రతిపక్ష నాయకులు పనితో గెలువలేక ఇష్టమొచ్చిన హామీలు ఇస్తున్నారని విమర్శించారు. వాళ్లు చెప్పినదానికంటే ఎకువ సంక్షేమం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఆ విషయాలను అతి త్వరలోనే సీఎం కేసీఆర్ వెల్లడిస్తారని, ప్రజలు తొందరపడొద్దని సూచించారు. నిన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత ఆదివారం తుక్కుగూడలో జరిగిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వీటినే కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరో కొత్త పథకాన్ని అమలు చేస్తారని తెలుస్తోంది. ఇక, ఎన్నికలవేళ రాష్ర్టానికి విపక్ష నాయకులు క్యూ కడుతున్నారని, అడ్డగోలు హామీలు ఇస్తూ ప్రజలను బురిడీ కొట్టించాలని చూస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీ, బెంగళూరు నుంచి వచ్చి బూటకపు హామీలు ఇచ్చే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు సూచించారు. ఇక, రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఇళ్లు ఇచ్చే బాధ్యత తమదేనని కేటీఆర్ స్పష్టం చేశారు.