Telangana: తెలంగాణ ఎన్నికల్లోనూ ‘ఓట్ ఫ్రం హోం’.. అవకాశం ఎవరికంటే..!
- రాష్ట్రంలో ఇప్పటికే మొదలైన ఎన్నికల హడావుడి
- వచ్చే నెల 3న రాష్ట్రంలో ఈసీ అధికారుల పర్యటన
- 80 ఏళ్లు పైబడిన వారు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం
జమిలీ ఎన్నికల నిర్వహించే ఉద్దేశం కేంద్రానికి లేదని తేలిపోవడంతో తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. రాజకీయ పార్టీలు అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేయడానికి కుస్తీ పడుతుండగా.. ఇప్పటికే టికెట్ ఖరారైన అభ్యర్థులు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. సభలు, సమావేశాలతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. మరోవైపు, రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబధించి ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 3న ఎన్నికల సంఘం అధికారులు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ లోనే ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఓట్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేయనున్నట్లు ఈసీ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసినట్లు తెలిపారు. ఈ విధానంలో భాగంగా.. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు తమ ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించనున్నారు. వయసు పైబడడంతో వారు పోలింగ్ కేంద్రానికి రావడానికి వారి ఆరోగ్యం సహకరించకపోవచ్చని, వారి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని తీసుకొచ్చామని వివరించారు.
ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఓటర్లలో 80 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికి ఈ అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. అయితే, ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈసీ లెక్కల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో 80 ఏళ్లు దాటిన ఓటర్లు 4.87 లక్షల మంది ఉన్నారు. ఇందులో ముందుగా దరఖాస్తు చేసుకున్న వారి కోసం పోస్టల్ బ్యాలెట్ ను సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.