Pakistan: భారత్ లో జరిగే వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ జట్టు ఎంపిక
- అక్టోబరు 5 నుంచి భారత్ లో ఐసీసీ వరల్డ్ కప్
- 15 మందితో జట్టును ప్రకటించిన పాకిస్థాన్
- బాబర్ అజామ్ నాయకత్వంలో వరల్డ్ కప్ బరిలోకి పాక్
- గాయంతో బాధపడుతున్న యువ పేసర్ నసీమ్ షాకు విశ్రాంతి
అక్టోబరు 5 నుంచి భారత్ లో జరిగే ఐసీసీ వరల్డ్ కప్ కోసం నేడు పాకిస్థాన్ జట్టును ప్రకటించారు. 1992లో వరల్డ్ కప్ నెగ్గి ముచ్చట తీర్చుకున్న పాక్... రెండోసారి మెగా టోర్నీలో విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఉన్నంతలో బలమైన జట్టును ఎంపిక చేసింది. వరల్డ్ కప్ లో ఆడే పాక్ జట్టుకు బాబర్ అజామ్ నాయకత్వం వహిస్తాడు. గత కొన్నాళ్లుగా పాక్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో బాబరే కెప్టెన్.
కాగా, ఇటీవల ఆసియా కప్ లో గాయపడిన యువ పేసర్ నసీమ్ షాను వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేయలేదు.అతడికి బదులుగా సీనియర్ పేసర్ హసన్ అలీని జట్టులోకి తీసుకున్నారు. మంచి లయతో బౌలింగ్ చేస్తూ వన్డేల్లో మెరుగైన రికార్డు కలిగిన నసీమ్ షా లేకపోవడం పాక్ జట్టు వరల్డ్ కప్ ప్రణాళికలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. నసీమ్ షా 14 వన్డేల్లో 16.96 సగటుతో 32 వికెట్లు తీయడం విశేషం. అందులో రెండుసార్లు ఐదేసి వికెట్లు పడగొట్టాడు.
ఇక, పాక్ టాపార్డర్ లో బాబర్ అజామ్ తో పాటు ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్, సల్మాన్ ఆఘాలకు చోటు కల్పించారు. అంతేకాదు, మిడిలార్డర్ లో మహ్మద్ హరీస్, సాద్ షకీల్ వంటి యువ ఆటగాళ్లకు ఈ వరల్డ్ కప్ ఓ సదవకాశం.
భారత్ లో జరిగే వరల్డ్ కప్ లో పాక్ ఆశలన్నీ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిదిపైనే పెట్టుకుంది. అఫ్రిది ఆరంభంలోనే వికెట్లు తీస్తే ఎంతటి బలమైన జట్టునైనా ఓడించగలమని పాక్ గత కొన్నేళ్లుగా నిరూపిస్తోంది. అతడికి హరీస్ రవూఫ్, మహ్మద్ వాసిమ్, హసన్ అలీ నుంచి సహకారం లభిస్తే నసీమ్ షా లేని లోటు భర్తీ అవుతుంది.
భారత్ లో స్పిన్ పిచ్ లను దృష్టిలో ఉంచుకుని షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, సల్మాన్ ఆఘా, ఇఫ్తికార్ అహ్మద్ వంటి స్పిన్ ఆల్ రౌండర్లకు జట్టులో చోటు కల్పించినట్టు అర్థమవుతోంది. వరల్డ్ కప్ లో ఆడే పాక్ జట్టులోకి ఎంపికైన ఉసామా మిర్ లెగ్ స్పిన్ వేయగలడు.