Perni Nani: ఆ రోగం ఉందని సర్టిఫికెట్ తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు సీటును క్యాప్చర్ చేశాడు!: పేర్ని నాని

Perni Nani says Balakrishna trying to capture chandrababu seat
  • నందమూరి బాలకృష్ణను ఉద్ధేశించి చురకలు అంటించిన వైసీపీ నేత
  • బావగారు తన తండ్రిని కసకసా పొడిచేస్తుంటే కత్తి అందించిన వ్యక్తి అంటూ విమర్శలు
  • పార్టీ అధినేత కుర్చీలో కూర్చొని క్యాప్చర్ చేసుకున్నాడని వ్యాఖ్య
  • అసెంబ్లీ అంటే సినిమాల్లో స్క్రిప్ట్ రైటర్, మాటల రచయిత రాసిచ్చినట్లు కాదని ఎద్దేవా
ఏపీ అసెంబ్లీలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై పేర్ని నాని మాట్లాడుతూ పరోక్షంగా టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తనకు పలానా రోగం ఉందని అధికారిక సర్టిఫికెట్ తెచ్చుకున్న వ్యక్తి ఈ రోజు అసెంబ్లీ వేదికగా తన రుగ్మతను ప్రదర్శించారని వ్యాఖ్యానించారు. పాపం గతంలో తన నాన్నగారిని తన బావగారు కసకసా పొడిచేస్తుంటే పక్కనే ఉండి కత్తి అందించిన వ్యక్తి అవకాశం దొరకగానే చంద్రబాబు సీటును క్యాప్చర్ చేసుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ కాగానే, పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆయన స్థానంలో కూర్చున్నారని, తద్వారా కార్యాలయాన్ని క్యాప్చర్ చేశారన్నారు.

సాధారణంగా పార్టీ కార్యాలయమైనా, అసెంబ్లీ వేదిక పైన అయినా అధికార పార్టీ నేతకు, ప్రతిపక్ష నేతకు ఓ స్థానం ఉంటుందని, ఆ స్థానంలో ఎవరూ కూర్చోరని చెప్పారు. వారు పార్టీ కార్యాలయానికి లేదా సభకు రాకుంటే ఆ స్థానం ఖాళీగా ఉంటుందన్నారు. తాము కూడా తమ పార్టీ కార్యాలయానికి వెళ్లినప్పుడు జగన్ ఉన్నా, లేకపోయినా ఆయన కుర్చీలో ఎవరూ కూర్చోరని చెప్పారు. బాలకృష్ణ మాత్రం టీడీపీ కార్యాలయానికి వెళ్లి చంద్రబాబు కుర్చీలో కూర్చున్నారన్నారు.

అసెంబ్లీలోకి రాగానే ప్రతిపక్ష నేత (చంద్రబాబు) కుర్చీలో కూర్చున్నారని తెలిపారు. అంతలో మరో సభ్యుడు కూర్చోలేదని చెప్పగా, పేర్ని నాని స్పందిస్తూ... ముందు కూర్చున్నాడు.. ఆ తర్వాత నిలుచున్నాడని వివరణ ఇచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రెండు లక్షల మందికి ట్రెయినింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారని, కానీ ఎవరికి, ఎప్పుడు ఇచ్చారో చెప్పలేదన్నారు. మీకు స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో కానీ, ఇది సినిమాల్లో స్క్రిప్ట్ రైటర్, మాటల రచయిత రాసిచ్చినట్లు కాదని చురకలు అంటించారు.
Perni Nani
Balakrishna
Chandrababu
Andhra Pradesh

More Telugu News