Singham: సింగం లాంటి సినిమాలు చాలా డేంజర్.. బాంబే హైకోర్టు న్యాయమూర్తి

Films Like Singham Send Dangerous Message Says Bombay High Court Judge
  • సినిమాల్లో న్యాయమూర్తులను అవమానకరంగా చూపిస్తున్నారని ఆవేదన
  • దోషులను కోర్టులు వదిలి పెడతాయన్న భావనను ప్రజల్లో రగిలిస్తున్నాయన్న జస్టిస్ గౌతం పటేల్
  • ఓ వ్యక్తి దోషా? నిర్దోషా? అనే ప్రక్రియ కోర్టు ద్వారా మాత్రమే జరగాలన్న న్యాయమూర్తి
  • ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తే చట్టబద్దమైన పాలన గాడితప్పుందని హెచ్చరిక
‘సింగం’ లాంటి సినిమాలు సమాజంలోకి ప్రమాదకరమైన సందేశాన్ని పంపిస్తున్నాయని బాంబే హైకోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీస్ సంస్కరణ దినోత్సవం, ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతం పటేల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చట్ట ప్రక్రియపై ప్రజల అసహనాన్ని కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు.   

‘‘రౌడీలు, అవినీతిపరులు, జవాబుదారీతనంలేని పోలీసు పాత్రలు సినిమాల్లో పాప్యులర్ అవుతున్నాయి. ఇదే విషయాన్ని న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు సహా ప్రజాజీవితంలోని ఎవరికైనా ఆపాదించవచ్చు. కోర్టులు తమ పని చేయడం లేదని భావించినప్పుడు అదే పనిని పోలీసులు చేస్తే ప్రజలు సంబరాలు చేసుకుంటారని సినిమాల్లో చూపిస్తున్నారు’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

అత్యాచార కేసు నిందితుడు ఎన్‌కౌంటర్‌లో హతమైతే పర్వాలేదని సెలబ్రేట్ చేసుకుంటారని, న్యాయం జరిగిందని భావిస్తారని పేర్కొన్నారు. దీనికి కారణం సినిమానేనని వివరించారు. సినిమాల్లో న్యాయమూర్తులను చాలా అవమానకరంగా చిత్రీకరిస్తారని జస్టిస్ గౌతం పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులను పిరికివాళ్లలా, మందపాటి కళ్లద్దాలు ధరించి, చెత్త దుస్తులు ధరించేలా చిత్రీకరిస్తారని పేర్కొన్నారు. అంతేకాదు, దోషులను కోర్టులు శిక్షించకుండా వదిలిపెడతాయని వారు నిందిస్తారని అన్నారు. అప్పుడు పోలీస్ అయిన హీరో ఒంటరిగానే న్యాయం చేస్తాడని సినిమాల్లో చూపిస్తారని అన్నారు.  

‘‘సింగం సినిమా క్లైమాక్స్‌లో ప్రకాశ్‌రాజ్ రాజకీయ నాయకుడి పాత్ర పోషించారు. పోలీసు బలగాలు మొత్తం దిగి న్యాయం జరిగినట్టు చూపిస్తాయి. నిజంగా అలా జరుగుతుందా అని అడుగుతున్నాను. ఇది చాలా ప్రమాదకరమైన సందేశం. ఎందుకీ అసహనం? అతడు అపరాధా? నిరపరాధా? అన్నది ఓ ప్రక్రియ ద్వారా నిర్ధారించాలి. ఈ ప్రక్రియలు నెమ్మదిగా సాగుతాయి. అవి అలాగే ఉండాలి. ఎందుకంటే వ్యక్తిస్వేచ్ఛను హరించకూడదనేది ఇక్కడ ప్రధాన సూత్రం’’ అని జస్టిస్ పటేల్ వివరించారు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ‘షార్ట్‌కట్స్’లో చేయాలనుకుంటే అప్పుడు తాము చట్టబద్ధమైన పాలనను పాడుచేసిన వాళ్లమవుతామని పేర్కొన్నారు.   

2010లో తమిళ నటుడు సూర్య హీరోగా వచ్చిన సింగం సినిమాను 2011లో అజయ్ దేవగణ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో హిందీలో రీమేక్ చేశారు. అక్కడ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
Singham
Bollywood Movie
Bombay High Court
Justice Gautam Patel

More Telugu News